Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. నోటిఫికేషన్ దగ్గర నుంచి పోలింగ్ దాకా చిత్ర విచిత్రాలకు వేదిక అయింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఆ తర్వాత టిఆర్ఎస్ తన అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో నిలిచింది.. ఇక మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో జాతీయ రాజకీయాల్లో ఉనికి చాటడమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీని బి.ఆర్.ఎస్ గా కెసిఆర్ మార్చారు.. మునుగోడు ఫలితాన్ని తొలి విజయంగా ప్రకటించారు. 2001లో టిఆర్ఎస్ ను స్థాపించి సిద్దిపేట ఉప ఎన్నిక ద్వారా గెలుపు సాధించామని.. ఇప్పుడు మునుగోడు గెలుపు ద్వారా కేంద్రాన్ని ఎదుర్కొంటామని కెసిఆర్ బంగారిగడ్డ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు.. ఇక ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణులకు ఊపు ఇచ్చింది. దుబ్బాక, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నేర్చుకున్న గుణపాఠాలను వ్యూహంగా మల్చుకొని పటిష్టంగా ఓటర్లకు చేరువ కావడం, ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం వల్లే ఆ రెండు స్థానాలకు భిన్నంగా ఫలితం దక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ మూడు గుర్తులతో గండి
మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు టిఆర్ఎస్ మెజారిటీకి గండి కొట్టాయి. ముందు నుంచి టిఆర్ఎస్ వ్యక్తం చేసిన ఆందోళన నిజమైంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కారును పోలిన గుర్తులను కేటాయించింది. ముగ్గురు స్వతంత్రులకు 6,551 ఓట్లు పోలయ్యాయి. మారమోని శ్రీశైలం యాదవ్ అనే స్వతంత్ర అభ్యర్థికి రోటి మేకర్ గుర్తుని కేటాయించగా అది కారు గుర్తును పోలి ఉంది. ఈయనకు 2,407 ఓట్లు వచ్చాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థి కే శివకుమార్ రోడ్డు రోలర్ గుర్తుకు 1,874 ఓట్లు వచ్చాయి. దళిత శక్తి ప్రోగ్రాం అభ్యర్థి ఏర్పుల గాలయ్య చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. రోటి మేకర్, రోడ్డు రోలర్ గుర్తులు మొదటి ఈవీఎం లో ఉన్నాయి. రెండో ఈవీఎంలో రెండో గుర్తు ఏర్పుల గాలయ్యది.
నాలుగో ఆర్ జమ కాలేదు
రాష్ట్రంలో మరో ఆర్ ను గెలిపించుకుంటామన్న కమలనాథుల ఆశలు గల్లంతయ్యాయి. మునుగోడు పరాజయంతో త్రిబుల్ ఆర్ రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ వరకే బిజెపి పరిమితం కావలసి వచ్చింది. 2018 సాధారణ ఎన్నికల్లో బిజెపి తరఫున గోషామహల్ నుంచి రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ “ఆర్” అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్నవారిని బిజెపి పోటీలోకి దింపింది. దుబ్బాక ఎన్నికల్లో తన అభ్యర్థిగా రఘునందన్ రావు ను బరిలోకి దింపింది. హోరాహోరీగా జరిగిన లెక్కింపులో రఘునందన్ రావు విజయం సాధించారు. 2021లో నాగార్జునసాగర్ టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చనిపోగా అక్కడ ఉప ఎన్నికల్లో బిజెపి తన అభ్యర్థిగా రవికుమార్ ను బరిలోకి దించింది. కానీ ఆయన అక్కడ ఓటమిపాలయ్యాడు. ఏడాది ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ బర్తరఫ్ చేయడంతో ఆయన బిజెపిలో చేరాడు. తర్వాత హుజరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఈయన గెలుపు తర్వాత వారి ముగ్గురిని త్రిబుల్ ఆర్ గా శాసనసభలో పిలిచేవారు. దీనికి మరో ఆర్ యాడ్ చేద్దామని బిజెపి నాయకులు అనుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు.

ఖజానాపై భారం
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త పథకాలు పుట్టుకొచ్చాయి. ఏడవ క్రితం హుజరాబాద్ లో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకం తెరపైకి వచ్చింది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి నగదు బదిలీని ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో ఉపఎన్నిక వస్తే కొత్త పథకం వస్తుందని అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఉప ఎన్నిక వస్తే నియోజకవర్గ సమస్యలు కూడా తీయతాయని, ఇతర సంక్షేమ పథకాల పెండింగ్ నిధులు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నిక రావడంతో మునుగోడు నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఒకటో తేదీనే మునుగోడు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతోంది.