‘సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. 6 నెలల్లో ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి. అధికారం కేంద్ర స్థాయిలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం, ప్రతీ చిన్న అంశాన్ని అగ్ర నాయకత్వమే నిర్ణయించడం దీర్ఘకాలంలో పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తుంది. అలాగే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలను మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించిన ఈ లేఖలో పలువురు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు సంతకాలు చేశారు. వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి థరూర్, పీజే కురియన్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, రేణుకా చౌదరి, మిలింద్ దేవ్‌రా, అజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, భూపిందర్ సింగ్ హూడా, రాజిందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, సందీప్ దీక్షిత్ తదితరులున్నారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతూ మరి కొందరు నేతలు లేఖ రాశారు. ఎంపీ మానికం ఠాగోర్ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘గాంధీలు త్యాగానికి గుర్తులు. రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్షుడు కావాలని 1,100 మంది ఏఐసీసీ సభ్యులు, 8,800 పీసీసీ సభ్యులు, 5 కోట్లమంది పార్టీ కార్యకర్తలు, 12 కోట్ల మంది పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఏఐసీసీ వెంటనే గత నెల 24న సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసింది. అధ్యక్ష ఎంపికనే ప్రధాన అజెండాగా సాగాల్సిన సీడబ్ల్యూసీ మీటింగ్ లేఖ చుట్టే తిరిగింది. ఇదే సమావేశంలో ఎంపీ రాహుల్ గాంధీ అసమ్మతి వాదులంటూ.. పార్టీలో బీజేపీ ఏజెంట్లంటూ ఘాటు విమర్శలకు కూడా దిగారు. ఈ విమర్శలు చేసిన కాసేపటికే సీనియర్లైన ఆజాద్, సిబల్ రాహుల్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్ శిబిర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఆ తర్వాత ఈ 23 మంది నేతలు ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు. చాలా రోజులపాటు అందరూ ఒకే తాటిపై నిలబడ్డారు. కానీ.. మెళ్లిమెళ్లిగా ఆ అసంతృప్తుల్లోనూ చీలిక వచ్చింది. ఇప్పుడు రెండు శిబిరాలుగా విడిపోయినట్లుగా సమాచారం. చివరగా ఆజాద్‌ను ఏకాకీని చేసినట్లుగా తెలుస్తోంది. లేఖ, తదనంతర పరిణామాలను మరిచిపోయి తిరిగి క్రియాశీలకంగా మారిపోదాం అని ఓ నేత ప్రతిపాదనలు పెట్టగా.. ఆ ప్రతిపాదనల మీద విభేదాలు వచ్చినట్లు సమాచారం. డిమాండ్లపై అధిష్ఠానాన్ని ఓ పట్టు పట్టాల్సిందేనని, వెనక్కి తగ్గవద్దని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో అసమ్మతి శిబిరం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ వారంలోనే మరోసారి సమావేశం కావాలనుకున్నా.. హాజరు కాకూడదని ఓ వర్గం డిసైడ్ అయ్యింది. మరో వర్గం మాత్రం ఈ సమావేశంలోనే తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకుంటామని ప్రకటించింది.
అయితే లేఖ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఎంపీ శశి థరూర్ మాత్రం మళ్లీ ఈ లేఖపై చర్చించడానికి ఏమాత్రం సిద్ధపడటం లేదు. అది ‘ముగిసిన అంశమ’ని, మళ్లీ చర్చలెందుకని అంటున్నారు. పార్టీలో జూనియర్లైన జితిన్ ప్రసాద్ (యూపీ), అఖిలేశ్ ప్రసాద్ సింగ్ (బిహార్) కూడా అది ముగిసిన అధ్యాయమని పేర్కొంటున్నారు. అయితే ఈ శిబిరానికి అనధికారికంగా నాయకత్వం వహిస్తున్న గులాంనబీ ఆజాద్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈయనతోపాటు కపిల్ సిబల్, మనీశ్ తివారీ కూడా ఆజాద్ వైపే మొగ్గు చూపారు. లేఖలో పేర్కొన్న అంశాలపై తాము పోరాడతామని, మరి కొందరు కూడా కలిసి వస్తారని, ఇది వ్యక్తి గురించి కాదని, పార్టీ గురించి అని ఆజాద్ వర్గం స్పష్టం చేస్తోంది.