ప్రస్తుతం అమల్లో ఉన్న ఓడరేవుల చట్టంలో సవరణలను ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ముసాయిదా బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే చట్ట రూపాన్ని దాల్చుతుంది. సవరణలతో కూడిన ఓడరేవుల చట్టం 2021 అమల్లోకి వస్తుంది. ఓడరేవులు, అందులో సాగే కార్యకలాపాలపై ఇప్పటికే సర్వ హక్కులను కేంద్రం స్వాదీనం చేసుకుంది.
దేశంలో తీర ప్రాంత రాష్ర్టాలు మొత్తం తొమ్మిది ఉన్నాయి. ఏపీ సీఎం జగన్, గుజరాత్ విజయ్ రుపాణి, మహారాష్ర్ట ఉద్దవ్ ఠాక్రే, గోవా ప్రమోద్ సావంత్, కర్ణాటక యడ్యూరప్ప, కేరళ విజయన్, ఒడిశా నవీన్, పశ్చిమబెంగాల్ మమత బెనర్జీతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రంగస్వామిలకు స్టాలిన్ లేఖలు రాశారు. ఆయా రాష్ర్టాల్లో మేజర్, మైనర్ పోర్టులు ఉన్నాయి. అందులో కొనసాగే లావాదేవీలకు సంబంధించి వ్యవహారాలపై రాష్ర్టాలకు కొంత వరకు అధికారాలు ఉన్నాయి.
ఓడరేవుల చట్టం 2021లో కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టదలచిన సవరణల వల్ల తమ రాష్ర్టాల్లో ఉన్న ఓడరేవులపై ఆయా ప్రభుత్వాలన్ని అధికారాలను కోల్పోతామని పేర్కొన్నారు. దీన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఐక్య కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందని, సమష్టిగా పోరాడాల్సి ఉందని చెప్పారు. తాజా సవరణల వల్ల చిన్న తరహా ఓడరేవుల పైన కూడా రాష్ర్టాలకు అధికారం ఉండదని పేర్కొన్నారు.
తాజా సవరణలపై ఇప్పటికే తమ అభ్యంతరాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు. కొత్తగా కేంద్రం ప్రతిపాదించిన ఈ సవరణల వల్ల చిన్న తరహా ఓడరేవులపైన కూడా ఆయా రాష్ర్టాలు తమ హక్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మ్యారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ భేటీలో ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు తమ నిరసన తెలియజేయాలని కోరారు.