హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఎవరు?

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక అసలు సిసలు తెలంగాణ ఉద్యమకారుడికి కేసీఆర్ పట్టం కట్టారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ లో జోష్ నింపారు. టీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు హుజూరాబాద్ లో సమరశంఖం పూరించారు.. హరీష్ రావు ఇప్పటికే హుజూరాబాద్ లో వాలిపోయి భారీ బైక్ ర్యాలీ, సభను నిర్వహించారు. ఇంతకీ టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరు? ఎక్కడి వారు అన్నది ఆసక్తి రేపుతోంది. టీఆర్ఎస్ […]

Written By: NARESH, Updated On : August 11, 2021 6:34 pm
Follow us on

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక అసలు సిసలు తెలంగాణ ఉద్యమకారుడికి కేసీఆర్ పట్టం కట్టారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ లో జోష్ నింపారు. టీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు హుజూరాబాద్ లో సమరశంఖం పూరించారు.. హరీష్ రావు ఇప్పటికే హుజూరాబాద్ లో వాలిపోయి భారీ బైక్ ర్యాలీ, సభను నిర్వహించారు. ఇంతకీ టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరు? ఎక్కడి వారు అన్నది ఆసక్తి రేపుతోంది.

టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడే ఈ గెల్లు శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి.. కేసుల పాలై జైలుకు వెళ్లిన ఉద్యమకారుడు. పార్టీ పట్ల శ్రీనివాస్ నిబద్దతను గుర్తించిన కేసీఆర్ ఆయననే అభ్యర్థిగా ఖరారు చేశారు. గెల్లు శ్రీనివాస్ కుటుంబం కూడా రాజకీయాల్లోనే ఉంది. తండ్రి గెల్లు మల్లయ్య మండలస్థాయిలో 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2004లో టీఆర్ఎస్ లో చేరారు. పలు పదవులను చేపట్టారు. గెల్లు శ్రీనివాసయాదవ్ తల్లి హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు.

గెల్లు శ్రీనివాస్ ది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామం. 1983 ఆగస్టు 21న గెల్లు మల్లయ్య-లక్ష్మీ దంపతులకు ఈయన జన్మించారు. ఇంటర్ వరకూ కరీంనగర్ జిల్లాలోనే చదివిన శ్రీనివాస్.. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీహెచ్.డీ చేశారు. గగన్ మహల్ లోని ఏవీ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. అంబర్ పేటలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ పూర్తి చేశాడు. 2003-2006 వరకు హాస్టల్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ కాలంలో బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడై ఆయనకు మద్దతుగా టీఆర్ఎస్ లో చేరారు. ఏవీ కాలేజీలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా కొనసాగారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ కోసం ఇందిరా పార్క్ లో అప్పటి చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ టీఆర్ఎస్వీ పట్టణ కార్యదర్శిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ విద్యార్థి మహాపాదయాత్రలో పాల్గొన్నారు.

2010లో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ ను బాల్క సుమన్ నియమించారు. 2017 నుంచి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు. 2010లో జనవరిలో తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్రలో భాగంగా శ్రీనివాస్ యాదవ్ ఓయూ నుంచి కాకతీయ యూనివర్సిటీ మీదుగా 650 కి.మీలు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయడంలో విజయం సాధించారు. 2010లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్టూడెంట్ ఇన్ చార్జిగా బస్సు యాత్రలో పనిచేశారు. 2011లో మౌలాలి రైల్వే స్టేషన్ లో 48 గంటల రైల్ రోఖో లో కేటీఆర్ నాయకత్వంలో విజయవంతం చేశారు.

తెలంగాణ రాకముందు మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె సహా సాగరహారం కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గెల్లు శ్రీనివాసయాదవ్ పై 100కు పైగా కేసులున్నాయి. చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలో 36 రోజుల పాటు జైలు శిక్షను కూడా గెల్లు అనుభవించారు.

2001 నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలక పాత్రపోషించారు. అందుకే ఈ ఉద్యమ నాయకుడికి కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ నందించారు. ఉద్యమకారుడికే పట్టం కట్టి సంతోషపరిచారు.