
Vundavalli Sridevi: వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎక్కడ చూసినా ఒక సీన్ కనిపించేది. అదే సీఎం జగన్ భజన. అసెంబ్లీలోనైనా, బయటైనా, ఎక్కడైనా ఒకటే . జగన్ నినాదంతో మార్మోగేది. మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడి మరీ జగన్ పొగడ్తలతో ముంచెత్తేవారు. కొందరు మంత్రులైతే వంగి వంగి నమస్కారాలు చేసేవారు. మరికొందరు అయితే ఏకంగా కాళ్లకు నమస్కారం చేశారు. అచ్చం తమిళనాడు తరహాలో సీన్ క్రియేట్ చేసేవారు. అంతెందుకు.. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి సైతం జగన్ పొగిడే నేతల జాబితాలో ఉన్నవారే. ఈ ముగ్గురితో పోల్చుకుంటే ఆనం రామనారాయణరెడ్డి మాత్రం పెద్దగా రెస్పాండ్ అయిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గతంలో జగన్ భజన చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా అదే పనిగా ట్రోల్ చేస్తోంది. దీంతో వైసీపీ శ్రేణులు తెగ రియాక్టవుతున్నారు.
జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు..
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థికి ఓటేశారన్నది వైసీపీ ఆరోపణ. అది క్రాష్ చెక్ లో తేలడంతో వైసీపీ చర్యలకు ఉపక్రమించింది, నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఉండవల్లి శ్రీదేవి విషయంలో కొద్దిగా అతి క్రియేట్ అయ్యింది. ఆమె కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. విధ్వంసం సృష్టించాయి. అయితే తాను ఏ తప్పు చేయలేదని..వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని.. దళిత మహిళా ఎమ్మెల్యేనైనందునే తనపై కక్ష కట్టారని ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ ను కలిసి అన్ని నివృత్తి చేశాక కూడా తనపై అనుమానించడం దారుణమని వ్యాఖ్యానించారు. తన కార్యాలయంపై దాడిని ఖండించారు. ప్రజల మద్దతు ఉన్నంతవరకూ తాను రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు.
హైకమాండ్ తీరుతోనే..
అయితే ఉండవల్లి శ్రీదేవి అనూహ్య నిర్ణయం వెనుక మాత్రం వైసీపీ హైకమాండ్ తప్పిదమే కారణం. ఆమె అధిష్ఠానానికి ఏ నివేదికలు వెళ్లాయో తెలియదు కానీ.. ఆమెకు ప్రత్యామ్నాయంగా.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆమె ఎమ్మెల్యేగా ఉండగా.. టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ను ఇన్ చార్జిగా నియమించారు. ఆయన్నే అన్నివిధాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. కార్యకర్తలు సైతం ఏమైనా పనులు జరగాలంటే డొక్కానే సంప్రదించే పరిస్థితి వచ్చిందట. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవిని డమ్మీ చేశారని ఆమెఅత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. అంటే పరోక్షంగా రానున్న ఎన్నికల్లో శ్రీదేవిని కాదని.. డొక్కాకే టికెట్ ఇస్తామని చెప్పేసినట్లేనని శ్రీదేవి వర్గం భావించిందట. ఈ వరుస పరిణామాలతో అధిష్ఠానానికి శ్రీదేవికి మధ్య మరింత గ్యాప్ పెరిగిపోయిందట. సరిగ్గా ఇటువంటి సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో శ్రీదేవికి చాన్స్ వచ్చింది. దీంతో ఆమె కుమార్తెను తీసుకొని ఇటీవల సీఎం జగన్ ను కలిశారు. టిక్కెట్ విషయంపై పట్టుబట్టారు. కానీ అటు నుంచి ఎటువంటి హామీ రాలేదు. దీంతో తన ఓటుతో సరైన సమాధానం చెప్పారు.

వైసీపీ శ్రేణులకు టార్గెట్ గా శ్రీదేవి..
ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఉండవల్లి శ్రీదేవినే టార్గెట్ చేసుకుంటున్నాయి. వైసీపీ మాక్ పోలింగ్ కు వచ్చి.. అంత నమ్మకంగా ఉండి దెబ్బ వేయడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే అక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్ రూపంలో ప్రత్యామ్నాయ నాయకత్వం ఉండడంతో వైసీపీ శ్రేణులు ఆయన పంచన చేరుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఉండవల్లి శ్రీదేవి పేరు హోరెత్తుతోంది. గతంలో అసెంబ్లీలో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొగుడుతూ శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘ఆగిపోయిన గుండై బైపాస్ సర్జరీ తరువాత కొట్టుకుంటే.. జగన్ జగన్ అని కొట్టుకుంటుంది’ అన్న మాటు.. పులిలాంటి జగన్ పుడతాడనే పులివెందులకు ముందుగా ఆ పేరు పెట్టారని శ్రీదేవి చేసిన కామెంట్స్ ను ట్యాగ్ చేశావు. దీనికి వైసీపీ శ్రేణులు, అభిమానులు రియాక్టవుతున్నారు. ‘ఎంత మాయ చేశావ్ శ్రీదేవి’ అంటూ వ్యాఖ్యానిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నెట్టింట్లో ఇప్పుడు ఇదే ప్రధాన టాపిక్ గా మారిపోయింది.