
Sri Chaitanya Atrocities : శ్రీ చైతన్య… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊడలు దిగిన కార్పొరేట్ విద్యా సంస్థ. ఇలా అనేకంటే విద్యార్థుల రక్త మాంసాల మీద కాసులు దండుకునే సంస్థ అంటే సబబు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పిఆర్ఓలను నియమించుకుని, తల్లిదండ్రులకు లేని పోనీ మాటలు చెప్పే శ్రీ చైతన్య.. విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. మీ వాడికి మంచి చదువు చెప్తామంటూ తల్లిదండ్రులకు ఆశ కల్పిస్తూ, ర్యాంకుల వేటలో విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ ఇబ్బంది తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అంతేకాదు అధ్యాపకుల వేధింపులు తట్టుకోలేక అనారోగ్యాల బారిన పడుతున్నారు.
వాస్తవానికి ఒక మనిషికి ఎనిమిది నుంచి పది గంటల నిద్ర అవసరం. శ్రీ చైతన్య లో చదువుతున్న విద్యార్థులకు కనీసం నాలుగు గంటలు కూడా నిద్ర ఉండదు. ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలయ్యే వారి దినచర్య రాత్రి ఒంటి గంట దాకా కూడా ముగియదు. స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసులు, నీట్ కోచింగ్, ఐఐటి కోచింగ్ పేరుతో విద్యార్థులను రాచి రంపాన పెడుతోంది యాజమాన్యం. తల్లిదండ్రుల నుంచి కూడా లక్షలకు లక్షలు ఫీజు లాగుతోంది.. శ్రీ చైతన్య అనుమతి ఉన్నవాటికంటే అనుమతి లేకుండా నిర్వహించే కాలేజీలే ఎక్కువ ఉన్నాయని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. దీనిపై ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు ఉండటం లేదని అవి ఆరోపిస్తున్నాయి.
వాస్తవానికి విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన శ్రీ చైతన్య యాజమాన్యం దానిని పూర్తిగా విస్మరిస్తోంది. ప్రజలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. అగ్గిపెట్టె లాంటి గదుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు నరకం చూపిస్తోంది.. పైగా మూత్రశాలలో కనీస శుభ్రత లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక ఆ భోజనం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే కనీసం తల్లిదండ్రులకు సమాచారం చెప్పే దిక్కు కూడా ఉండటం లేదు. విద్యార్థి ఆరోగ్యం క్షమించిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు. పైగా వారిని కళాశాల లోపలికి కూడా రానివ్వడం లేదు. ఏమైనా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగేందుకు కూడా వెనుకాడటం లేదు.. ప్రభుత్వ లెక్కల ప్రకారం శ్రీ చైతన్య లో గడిచిన సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు 70 మంది విద్యార్థులకు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.. అని ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.. మరోవైపు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు కార్పొరేట్ కాలేజీలో చదవాలనే మోజుతో శ్రీ చైతన్య లో పడేస్తున్నారు.. పైగా ర్యాంకులు తక్కువ వస్తే తమ పిల్లల్ని సూటిపోటి మాటలు అంటున్నారు. ఇటు అధ్యాపకుల ఒత్తిడి తట్టుకోలేక, అటు తల్లిదండ్రుల మాటలు పడలేక విద్యార్థులు చావేగతి అనుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అయితే ఇలాంటి సమయంలో విద్యార్థులకు మానసికంగా భరోసా కల్పించాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో జరగకూడని నష్టం జరిగిపోతోంది.. దీంతో తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతోంది.