
YS Avinash Bail : వివేకా హత్య కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది. మరోవైపు పులివెందులలో అదనపు బలగాలు మొహరించడం కీలక పరిణామం చోటుచేసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనిపై ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశముంది. అటు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించిన తరువాత సీబీఐ పులివెందులకు వెళ్లి మరోసారి దర్యాప్తు నిర్వహించింది. ఒక వైపు అదనపు బలగాలు మొహరించడం, ఇటు సీబీఐ విచారిస్తుండడం, ఇదే రోజు సుప్రీంలో ముందస్తు బెయిల్ పై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశముండడం వంటి చర్యలతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏదో అనూహ్య పరిణామం జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది.
నేడు విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు సోమవారం వరకూ గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ అరెస్ట్ చేయవద్దంటూ చెప్పిన సంగతి విదితమే. ఆ గడువునేటితో ముగుస్తుండడంతో మరోసారి విచారణ చేపట్టనున్నారు. ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కేసు ముమ్మర విచారణలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. దీంతో అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం 24 వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. దీంతో అవినాష్ రెడ్డికి స్వల్ప ఉపశమనం లభించింది. అయితే నేడు మరోసారి విచారణ చేపట్టనుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎటువంటి తీర్పు వస్తుందోనని అంతటా చర్చనీయాంశంగా మారింది.
బెయిలా? రద్దా?
అదే సమయంలో అవినాష్ రెడ్డికి బెయిల్ వద్దంటూ వైఎస్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెలాఖరులోగా కేసు విచారణ పూర్తికావాలని సుప్రీం కోర్టు ఆదేశాలను గుర్తుచేశారు. త్వరగా దర్యాప్తు చేయాలంటే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ పిటీషన్ వేశారు. దీంతో సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.అవినాష్ బెయిల్ అంశం తో పాటుగా వివేకా కేసు విచారణ గడువు పైనా నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే నేటి సుప్రీం కోర్టు తీర్పుపైనే కేసు ఆధారపడి ఉంది. ముందస్తు బెయిల్ కొట్టి వేస్తే మాత్రం అవినాష్ రెడ్డి తథ్యం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటిలాగే కొన్ని రోజులు పొడిగిస్తే మాత్రం మరోసారి ఎంపీకి ఉపశమనం కలిగే చాన్స్ ఉంది.
పులివెందులకు బలగాలు..
అయితే వివేకా హత్య కేసులో ఆయన రెండో భార్య షమీమ్ ఆరోపణల నేపథ్యంలో సీబీఐ సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని విచారించింది. ఆయనిచ్చిన సమాచారం మేరకు పులివెందులలో మరోసారి దర్యాప్తు చేసింది. చాలా వివరాలు సేకరించింది. అదే సమయంలో పులివెందులకు భారీ బలగాలు చేరుకున్నాయి. గతంలో భాస్కరరెడ్డి అరెస్ట్ సమయంలో సైతం పులివెందులలో వైసీపీ శ్రేణులు భారీ ఆందోళనలకు దిగాయి. ఆ సమయంలో పోలీసులు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం ముందుగానే బలగాలు చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీ బెయిల్ పిటీషన్ రద్దయితే ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పులివెందులలో విధ్వంసాలు చోటుచేసుకునే చాన్స్ ఉంది. అందుకే పోలీసులు ముందస్తుగా మొహరించినట్టు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో?