
పల్లె, పట్టణ ప్రగతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ర్టంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతోంది. సీఎం కేసీఆర్ ఒక జిల్లాను దత్తత తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. గ్రామాలు, పట్టణాల ప్రగతికి కృషి చేయాలని భావిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వాటి అమలు తీరుపై సీఎం సమీక్షించారు. అన్నిజిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలపై పురోగతిని తనిఖీల్లో భాగంగా పర్యవేక్షిస్తానని సీఎం వెల్లడించారు. త్వరలోనే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని గ్రామాలు, జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు.
అధికారుల పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్లు, డీపీవోల పనితీరు బేరీజు వేసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరు చెప్పినా వినేది లేదని స్పష్టం చేశారు. జూన్ 21న వరంగల్ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు.
అక్కడే మల్టీ సూపర్ స్పెషాలిీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాంకేతిక హంగులతో ఈ గ్రీన్ బిల్డింగ్ ఆస్పత్రిని నిర్మించనున్నారు. స్థానిక సంస్థల సమస్యల తక్షణ పరిష్కారం కోసం అదనపు కలెక్టర్లకురూ.25 లక్షల నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. అదనపు కలెక్టర్లకు రాష్ర్ట ప్రభుత్వం కొత్త వాహనాలను కేటాయించింది. ఒక్కొక్కటి దాదాపు రూ.25 లక్షల విలువైన కియా కార్లను అదనపు కలెక్టర్ల కోసం కొనుగోలు చేసింది.