JanaSena Party: రాష్ట్రంలో జనసేన ప్రత్యామ్నాయ వేదికగా మారుతోందా? గ్రౌండ్ లెవల్ లో ఆ పార్టీకి గ్రాఫ్ పెరుగుతోందా? రాష్ట్రంలో పరిస్థితులను గాడిలో పెట్టాలంటే పవన్ ఒక్కరే ఆశాదీపంగా కనిపిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో జనసేన బలీయమైన శక్తిగా ఎదుగుతుందా? అందుకే అన్ని రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తుకు వెంపర్లాడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో చేరికలు పెరుగుతుండడం మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటనలు రాష్ట్రంలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా.. ఆ స్నేహాన్ని ఏనాడూ రాజకీయ లబ్ధికి వినియోగించలేదు.
రాజ్యసభతో రాజ్యాంగబద్ధ పదవులు, నామినేటెడ్ పోస్టులకు దేబిరించలేదు. రాష్ట్రంలో అధికార పక్షం వైసీపీ, ప్రధాన విపక్షం టీడీపీ తమ పార్టీ మనుగడ కోసం, కేంద్ర ప్రభుత్వ ప్రాపకం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. మిత్ర పక్షంగా ఉన్నాపవన్ కళ్యాణ్ మాత్రం ఏనాడూ బీజేపీ సాయాన్ని కోరలేదు. ప్రజాసమస్యలపై నిష్కళంకంగా పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధిపైనా, రాష్ట్రంలో రైతు ఆత్మహత్య ఘటనపైనా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యలపైనా పవన్ పోరాడుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ లబ్థిని భేరీజు వేసుకొని వైసీపీ, టీడీపీలు స్పందిస్తుండగా…పవన్ మాత్రం అవేవీ ఆలోచించకుండా సమస్యలపై స్పందిస్తున్న తీరు అభినందనీయం. అన్నివర్గాల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ రాజకీయ వైరుధ్యాలతో వ్యతిరేకించిన వర్గాలు సైతం ఇప్పుడిప్పుడే జనసేనాని వైపు చూస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన గ్రాఫ్ అమాంతం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. గ్రామస్థాయిలో చేరికలతో పాటు కొందరు నేతలు సైతం జనసేనలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జనసేనాని ఒక అడుగు ముందుకేసి నేతల చేరికను షురూ చేయడంతో పాటు జిల్లా, మండల, గ్రామస్థాయి నూతన కార్యవర్గాలు, బూత్ కమిటీలు ఏర్పాటుచేస్తే 2024లో నూతన రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Also Read: Bandi Sanjay: ‘బండి’ వన్ మ్యాన్ షో.. క్యాడర్ కలిసి వస్తుందా?
ఉత్తరాంధ్రపై ఫోకస్
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలపై పవన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గత రెండు ఎన్నికల్లో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించిన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో అంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఈ సారి మాత్రం గట్టిగానే కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మండల, మునిసిపల్ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతోంది. తాజాతో పాటు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మునిసిపల్ చైర్మన్లు జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే జనసేన నాయకులకు టచ్ లోకి వెళ్తున్నారు. అంతర్గత సమావేశాల్లో సైతం జనసేనే శ్రేయస్కరమని భావిస్తున్నారు. మరోవైపు రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టి తెరమరుగైన కుటుంబాలు సైతం పవన్ ను విశ్వసిస్తున్నాయి. ఇందులో కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండడం విశేషం. ప్రముఖ వైద్యులు, లాయర్లు, ఎన్ఆర్ఐలు సైతం మొగ్గుచూపుతున్నారు. జనసేన టిక్కెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రాజగోపాలరావు కుటుంబాలది ప్రత్యేక స్థానం. దశాబ్దాల పాటు రాజకీయ ముద్ర వీరిది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ కుటుంబ వారసులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. కళా వెంకటరావు కుటుంబసభ్యులు సైతం తమకు రాజకీయ వారధిగా జనసేన కరెక్ట్ అని భావిస్తున్నారు.
విజయనగరంలో బొత్స కుటుంబసభ్యులు, మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ విప్ గద్దె బాబూరావు, తెంటు లక్షుంనాయుడు జనసేన ద్వారా రాజకీయంగా మరోసారి తెరపైకి రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, శత్రుచర్ల విజయరామరాజు కుటుంబసభ్యులు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో అయితే పార్టీకి గ్రాఫ్ అమాంతం పెరిగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కీలక నాయకులు జనసేనలోకి వెళ్లేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. నగరంలో కాపు సామాజికవర్గం అధికం. అటు భీమిలిలో కూడా కాపు ప్రాబల్యం ఎక్కువ. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే అక్కడ చేరికలు మొదలయ్యాయి. మరో ఆరు నెలల తరువాత మరింత ఊపందుకోనున్నాయి.
గ్రామస్థాయిలో బలోపేతం చేస్తే..
2019 ఎన్నికల్లో వైసీపీ రాజకీయ చతురత ప్రదర్శించింది. కులాలు, వర్గాల మధ్య కుంపట్టు పెట్టి వారిని తమ దరికి తెచ్చకుంది. రాజకీయ పునరేకీకరణతో గ్రామస్థాయిలో వర్గాలను సైతం ఏకం చేసి తన గూటికి చేర్చుకుంది. ఎన్నికల్లో భారీగానే లబ్ధి పొందింది. అయితే ఒక గ్రామంలో ఉన్న రెండు వర్గాలనూ వైసీపీ చేరదీసింది. కానీ ప్రస్తుతం ఆ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలు సమాన బలంతో ఉండడంతో విభేదాలు పెరుగుతున్నాయి. కానీ అందులో ఒక వర్గం విపక్ష టీడీపీ వైపు మాత్రం మొగ్గు చూపడం లేదు. జనసేనలోకి వెళ్లాలని భావిస్తున్నాయి. పవన్ ఒక అడుగు ముందుకేసి ఆ వర్గాన్ని క్యాచ్ చేసుకుంటే రాజకీయంగా మరింత బలోపేతం కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో నేతలు ముందుగా కేడర్ ను జనసేన గూటికి చేర్చుతున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు తాము చేరాలని భావిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రలో జనసేన బలీయమైన శక్తిగా అవతరిస్తోంది.
Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?