Atal Bihari Vajpayee Jayanti: భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటింది. పూర్తి ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ప్రధాన మంత్రిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రధానిని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు భారత దేశానికి 14 మంది ప్రధానులుగా పనిచేశారు. భారతీయ జనతాపార్టీ తరఫున ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. అపర చాణక్యుడు, అజాత శత్రువు అయిన వాజ్‌పేయి తన పాలనా దక్షతతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మూడుసార్లు ప్రధానిగా ఎంపికయ్యారు. తొలిసారి కేవలం ఒక రోజు మాత్రమే ప్రధానిగా వ్యవహరించారు. రెండోసారి నెల రోజులు, మూడోసారి ఐదేళ్లు దేశాన్ని పాటించారు. ఐదు దశాబ్దాలు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొమ్మిదిసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా పార్లమెంటులో వివిధ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించారు. మూడుసార్లు ప్రధానిగా దేశానికి సేవలందించారు. ఫోక్రాన్ అణు పరీక్షలు, పాకిస్తాన్‌తో స్నేహహస్తం, కార్గిల్ యుద్ధం వంటివి వాజ్‌పేయి హయాంలోనే జరిగాయి. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న వాయిజ్‌పేయి పుట్టిన రోజు అయిన డిసెంబర్ 25న ఏటా సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. నేడు ఆయన శత జయంతి.
బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు..
వాజ్‌పేయి భారతీయ జనతాపార్టీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కృష్ణాదేవి. కృష్ణబిహారీ వాజ్‌పేయి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి స్కూల్ టీచర్‌గా పనిచేసేవారు. వాజ్‌పేయి తాతగారు శ్యామ్‌లాల్ వాజ్‌పేయి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా బతేశ్వర్ నుంచి గ్వాలియర్ సమీపంలోని మొరేనాకు వలస వచ్చారు. సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యను అభ్యసించిన వాజ్‌పేయి 1934లో ఉజ్జయినీ జిల్లా బర్నాగర్‌లోని ఆంగ్లో–వెర్నాక్యులర్ మిడిల్ స్కూల్‌లో చేరారు. గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీలో బీఏ పూర్తి చేశారు. కాన్‌పూర్‌లో డీఏవీ కాలేజీ నుంచి పొలిటిక్ సైన్స్‌లో ఎంఏ చేశారు. దేశ విభజన సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా వాజ్‌పేయి న్యాయవిద్యను మధ్యలోనే వదిలేశారు.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి..
వాజ్‌పేయి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులపాటు జైలుకు వెళ్లారు. 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో స్వయం సేవక్‌గా పనిచేశారు. 1947లో ప్రచారక్‌గా మారారు. న్యాయవాద విద్యను మధ్యలో ఆపేశాక జర్నలిస్టుగా మారారు. జర్నలిజాన్ని వదిలేసిన తర్వాత 1951లో భారతీయ జన్‌సంఘ్‌లో పనిచేశారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా మారిపోయారు. 1957 ఎన్నికల్లో బలరాంపూర్ నుంచి తొలిసారి పోటీచేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
ముగ్ధుడైన నెహ్రూ…
ఎంపీగా తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టిన వాజ్‌పేయి వాగ్ధాటి చూసి నాటి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ముగ్ధుడయ్యాడు. ఏదో ఒకరోజు దేశనికి ప్రధాని అవుతాడని ఆరోజే జోష్యం చెప్పారు. అనంతరం బలరాంపూర్, గ్వాలియర్, న్యూఢిల్లీ లోక్‌సభ స్థానాల నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు లక్నో నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా..
ఇక ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక 1975–77 మధ్య 21 నెలలు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వాజ్‌పేయి పోరాటం చేశారు. జైలు జీవితం గడిపారు. 1977లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల తర్వాత మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా నిలిచారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఏర్పాటైంది. బీజేపీ తొలి అధ్యక్షుడిగా వాజ్‌పేయి వ్యవహరించారు. తన సహచరుడు, బీజేపీ సీనియర్ నేత అయిన ఎల్‌కే.అధ్వానీతో వాజ్‌పేయికి మంచి స్నేహం ఉంది.
1996లో ప్రధానిగా..
ఇక వాజ్‌పేయి నేతృత్వంలో 1996, మే 16న బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోయింది. దీంతో 13 రోజులకే రాజీనామా చేశారు. నాడు ఆయన పార్లమెంటులో చేసిన ప్రసంగం భారతదేశ రాజకీయ చరిత్రలో పదిలంగా నిలిచిపోయింది. 1998లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి 13 నెలలపాటు అధికారంలో ఉన్నారు. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షలో ఓడిపోయి ప్రభుత్వం కూలిపోయింది. అయితే తర్వాత ఇతర పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి.. విజయం సాధించడంతో వాజ్‌పేయి మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఈసారి ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. పూర్తికాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపు పొందారు.
కీలక నిర్ణయాలు..
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే 1998లో రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌లో భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా బెదరలేదు. స్మైలింగ్ బుద్ధ పేరిట తొలి అణుపరీక్షలు నిర్వహించి 24 ఏళ్ల తర్వాత రెండోసారి అనుపరీక్షలు చేసిన దేశంగా నిలిచింది.
– వాజ్‌పేయి దాయాది దేశమైన పాకిస్తాన్‌తో శాంతికోరుకున్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాలని 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ–లాహోర్ బస్సుయాత్ర ప్రారంభించారు. కానీ కొన్ని రోజులకే పాకిస్తాన్ తన వక్రబుద్ధి ప్రదరిశంచింది. ఈ కారణంగా అదే ఏడాది కార్గిల్ యుద్ధం జరిగింది.
– కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయి మరోమారు సుస్థిర పాలన అందించారు. అనేక సంస్కరణలు చేపట్టారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారు. భారత్, అమెరికా మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు బలోపేతం చేశారు.
– వాజ్‌పేయ్ హయాంలోనే 1999 డిసెంబర్‌లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేశారు. భారత్ అధీనంలో ఉన్న ఉగ్రవాది మసూద్ అజర్‌ను విడిపించుకోవడానికి ఈ పనిచేశారు. వాజ్‌పేయి ప్రజల కోసం అజహర్‌ను విడిపించి ప్రజలను రక్షించారు. ఇక 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడిచేశారు. 2002లో గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి.
– 2004 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. అయినా వాజ్‌పేయి కూటమి అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడిన ఆయన 2018 ఆగస్టు 16న తన 93వ ఏట మరణించారు.
అవివాహితుడిగా..
వాజ్‌పేయి కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆమె దూరం కావడంతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. నమిత అనే అమ్మాయిని కుమార్తెగా దత్తత తీసుకున్నారు. రాజకీయాల్లో తీరక లేకుండా గడిపిన వాజ్‌పేయి కవితలు అద్భుతంగా రాస్తారు. అయన కవితలు, పుస్తకాలు రాశారు. సంగీతం వినడం, వంట చేయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు.
అవార్డులు..
ఇక వాజ్‌పేయిని 1992లో పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. 1994లో ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. 2014లో భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో కేంద్రం సత్కరించింది. వాజ్‌పేయి జీవితంపై మైన్ అటల్ హూన్ అనే సినిమా తీశారు.