AP Media
AP Media: రాజ గురువు రామోజీరావుకు నిద్ర పట్టడం లేదు. అర్జెంటుగా జగన్ గద్దె దిగడం.. చంద్రబాబు పవర్ లోకి రావడం ఆయన ధ్యే యం. అందుకే తన రాతలతో రెచ్చిపోతున్నారు. వైసీపీ సర్కార్ పై విషం చిమ్మె ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని జగన్ సర్కార్ కు అంటగడుతున్నారు. గతంలో బాబు చేసినవన్నీ పుణ్యాలు.. నేడు జగన్ చేస్తున్న వన్నీ పాపాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తన పత్రికకు ఉన్న క్రెడిబుల్టీని పోగొట్టుకుంటున్నారు.
ఇటీవల ఈనాడు పత్రికను ఒక్కసారి పరిశీలిస్తే.. జాతీయ రాష్ట్ర స్థాయి వార్తలు సైతం పక్కకు వెళ్ళిపోతున్నాయి. కేవలం జగన్ సర్కార్ వైఫల్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు కడప జిల్లాలో కోళ్ల తగాదాలను సైతం రాజకీయ రంగు పులిమి పతాక శీర్షికన వార్తలు రాస్తున్నారు.
ఏపీలో సాక్షి, ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలు స్పష్టంగా పార్టీకి చెందినవే. కానీ ఈనాడు,ఆంధ్రజ్యోతి అలా కాదంటాయి. నిజానికి నిలువుటద్దమని చెబుతుంటాయి. ప్రజల గొంతుకని నమ్మిస్తాయి. కానీ స్పష్టమైన రాజకీయ అజెండా కనిపిస్తుంటుంది. చంద్రబాబుకు ప్రయోజనం లేనిదే వార్త కాదన్నట్టు ఈ సెక్షన్ ఆఫ్ మీడియా భావిస్తుంటుంది. ఏపీలో నికార్సు అయిన జర్నలిజం తమదేనన్నట్టు హడావిడి చేస్తుంటాయి . ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను చూస్తే కేవలం జగన్ సర్కార్ ను ప్రజల్లో పలుచన చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అత్యంత జుగుప్సాకరంగా కనిపిస్తాయి.
అయితే ఈ విషయంలో సాక్షి పత్రిక ఏమైనా తక్కువ అంటే అది కాదు. స్పష్టమైన పార్టీ పత్రిక. రాజశేఖర్ రెడ్డి బొమ్మను ప్రచురించుకున్న పార్టీ కరపత్రిక. ఇప్పుడు ఈనాడులో వచ్చిన కథనాలను కౌంటర్ ఇచ్చేందుకు మాత్రమే సాక్షి ప్రాధాన్యం ఇస్తోంది. ఈనాడులో ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే కథనాల్లో నిజానిజాలు ఎంత అని ఫ్యాక్ట్ చెక్ పేరిట వార్తలకే సాక్షిలో ఫస్ట్ ప్రయారిటీ కనిపిస్తోంది. మిగతా ప్రజాసమస్యలేవి అందులో కనిపించడం లేదు. ఇలా ఆంధ్రాలో జర్నలిజం విలువలను పాతాళంలోకి నెట్టేయడం అత్యంత జుగుప్సాకరం.