RK Kothapaluku: “గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు. ఇండియాలో చేరుతామని అన్నారు. నా కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అందుకు మీ అనుమతి అవసరమని అభ్యర్థించారు. నేను దానికి నో అని చెప్పాను. ఇదేం రాజరిక వ్యవస్థ కాదు. ప్రజా స్వామ్యం. అలాంటివి చెల్లుబాటు కావని నేను చెప్పాను” ఇటీవల నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. దీనికి కౌంటర్ గా కేటీఆర్ మాట్లాడారు. “నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి మోడీ అనుమతి దేనికి? ఆ లెక్కన 2018 ఎన్నికల్లో అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సరిగ్గా ఎన్నికల ముందు రెండు ప్రధాన పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు కావలసినంత స్టఫ్ దొరికింది. గత మూడు వారాలుగా “చంద్రబాబు నాయుడి అరెస్టు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష, జగన్మోహన్ రెడ్డి” అనే అంశాల ఆధారంగానే తన కొత్త పలుకు రాస్తున్న రాధాకృష్ణ.. తొలిసారి తెలంగాణలో చంద్రబాబు లైన్ దాటి ఎడిటోరియల్ రాశారు. ఆఫ్ కోర్స్ తను చంద్రబాబు లైన్ దాటి వస్తే బాగానే రాస్తాడు. ఆదివారం రాసిన కొత్త పలుకులో మాత్రం అటు మోది, ఇటు కేటీఆర్ చేసుకున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చేలాగా రాధాకృష్ణ రాసుకొచ్చాడు.
రాజకీయాలంటేనే పరస్పర ప్రయోజనాలు. ఏ రాజకీయ పార్టీ కూడా ఆచార్యుల మఠం కాదు. కచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన పొలిటికల్ లెక్కలు ఉంటాయి. భవిష్యత్తు లాభాలు కూడా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో అనుభవిస్తున్న భారత రాష్ట్ర సమితి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. కమ్యూనిస్టు పార్టీలతో అంట కాగింది. భారతీయ జనతా పార్టీ ర్యాలీలో పాల్గొంది. ఎంఐఎం ను విభేదించి.. తర్వాత తన మిత్రపక్షంగా చెప్పుకుంటున్నది. 2018లో చంద్రబాబు కూడా తాను భారత రాష్ట్ర సమితితో కలిసి పని చేయాలని అనుకున్నారని ఒక విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. మరి అప్పుడు దానిని భవిష్యత్తు రాజకీయ అవసరంగా అభివర్ణించిన రాధాకృష్ణ.. ఇప్పుడు మోదీ చెప్పిన మాటలను ఎలా వక్రీకరిస్తున్నారు? మోడీ చెప్పిన మాటలు బూమారాంగ్ అయ్యాయని ఎలా అంటారు? ఒక రాజకీయ పార్టీకి దాని అధ్యక్షుడే సుప్రీం. ఒకవేళ ఆ పార్టీ అధికారంలో ఉంటే ప్రధానమంత్రి అన్ని తానయి వ్యవహరిస్తారు. టిడిపిలో ఇప్పటికి చంద్రబాబే సుప్రీం. చంద్రబాబు తర్వాత ఆ స్థానంలో లోకేష్ కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు అయినప్పటికీ.. ఇప్పటికీ గాంధీ కుటుంబ సభ్యులదే ఆ పార్టీపై పెత్తనం. ఇక భారత రాష్ట్ర సమితిలో అయితే కెసిఆర్ లేదా కేటీఆర్.. సో ఇలా ప్రతి పార్టీలోనూ వ్యక్తి స్వామ్యమే నడుస్తోంది. మరి ఇన్ని తెలిసిన రాధాకృష్ణకు కేవలం బిజెపిలో మాత్రమే మోడీ స్వామ్యమే కనిపిస్తోందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బిజెపి, భారత రాష్ట్ర సమితి ఒకటే అనే విధంగా జనాల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడా?
గతంలో తను రాసిన అనేక వ్యాసాల పరంపరలో రాధాకృష్ణ మోడీ రాజకీయ చతురతను ఆకాశానికి ఎత్తేశాడు. రాజకీయ చతురత కనిపించినప్పుడు.. ఇప్పుడు ఎందుకు అతడిలో వ్యక్తిస్వామ్యం కనిపిస్తోంది? అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అనేక వ్యవస్థలను నాశనం చేసింది అని రాసుకొచ్చిన రాధాకృష్ణ.. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి రొట్టె విరిగి నీతిలో పడ్డట్టు కనిపిస్తోంది? అంటే తన పొలిటికల్ లైన్ ఆధారంగానే తన రాతలు ఉంటాయని రాధాకృష్ణ చెప్పకనే చెప్తున్నాడా? ఒకప్పుడు నిప్పులు చిమ్మే విధంగా రాతలు రాసే రాధాకృష్ణ.. ఇప్పుడు ఇలా మారిపోవడం నిజంగా బాధాకరమే. అన్నట్టు తెలంగాణ ఎడిషన్లో మోడీ వ్యాఖ్యలను, కేటీఆర్ కౌంటర్ ను ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కొత్త పలుకు రాసిన రాధాకృష్ణ.. ఏపీ ఎడిషన్ కు వచ్చేసరికి చంద్రబాబు జైలు జీవితాన్ని పలుకు అంశంగా మార్చుకున్నాడు.. అంటే ఏ రాష్ట్రానికి ఆ గొడుగు అన్నమాట?!