TRS MLAs Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ పనేనని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. కేసీఆర్ ప్రగతిభవన్ వేదికగా పన్నిన పన్నాగంగా కాషాయదళం పేర్కొంటోంది. భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్నది ప్రధాన ఆరోపణ. మునుగోడు ఉప ఎన్నికల వేళ వెలుగుచూసిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టించింది. అయితే బీజేపీ ప్రయోగించిన ముగ్గురు ఎవరు? వీరి మూలాలు ఎక్కడ? వీరికి రాజకీయాలతో ఉన్న సంబంధాలేంటి? అన్న విషయాలు ప్రతిఒక్కరిలో మెదులుతున్నాయి. ఈ క్రమంలో సింహయాజీ ఏపీకి చెందిన వ్యక్తి కావడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది ఆరాతీసే క్రమంలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి.

ప్రస్తుతం ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్నమండెల మండలం రామనాథపురంలో అశోక్ జన్మించారు. గ్రామంలో చిన్నపాటి ప్రైవేటు స్కూల్ ను స్థాపించారు. ప్రారంభంలో పాఠశాల పర్వాలేదనిపించినా తరువాత లాస్ వచ్చింది. దీంతో పాఠశాలను ఎత్తివేసిన అశోక్ రాయచోటిలో ఓ ప్రైవేటు స్కూల్ లో టీచరుగా చేరారు. కొద్దిరోజులకే అక్కడ కూడా మానేశారు. అటు తరవాత నారాయణ విద్యాసంస్థల పీఆర్వోగా చేరారు. అప్పుడే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. పారిశ్రామికవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటుచేసుకున్నారు. అటు తరువాత పీఆర్వోగా ఉద్యోగం మానేసిన ఆయన గోశాలలో ఉద్యోగం పొందారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ మరికొంతమంది ప్రముఖులను ఆకర్షించారు. పూజలు, యాగాలు పేరిట వారికి దగ్గరయ్యారు. భారీగానే నగదు పోగేసుకున్నారు. అక్కడకు కొద్దిరోజులకే గోశాల ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. అక్కడకు సరిగ్గా పది సంవత్సరాల తరువాత స్వామిజీ అవతారంలో ప్రత్యక్షమయ్యారు. సొంత గ్రామంలో శ్రీమంత్ర రాజపీఠం ఏర్పాటుచేసి వేలాది మంది భక్త గణాన్ని సంపాదించుకున్నారు. కరుణాకర్ సింహయాజీగా పేరు మార్చుకున్నారు.

అయితే స్వామిజీగా సొంత గ్రామస్థులు, ప్రాంతీయులు యాక్సెప్ట్ చేయలేదు. దీంతో పీఠాన్ని కొంతమందితో నడిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సొంత గ్రామం రామనాథపురంలో నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం విషయంలో సింహయాజీకి చుక్కెదురు కావడంతో.. ఇక లాభం లేదనుకొని తిరుపతికి మకాం మార్చారు. 15 ఏళ్లుగా అక్కడే ఓ పీఠం నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి సొంత గ్రామానికి వచ్చి వెళుతుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆయన పేరు బయటపడడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఏపీ మూలాలు ఉన్న ఆయన పేరు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన వెనుక ఎవరున్నారన్నది మాత్రం మిస్టరీగా మారింది.