Krishnudu-YCP: టీడీపీ, జనసేనతో పోలిస్తే వైసీపీకి సినీ గ్లామర్ తక్కువే. వైసీపీ ఆవిర్భావం తరువాత ఒక్క రోజా మాత్రమే ఆ పార్టీ వెంట నడిచారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల ముందు మాత్రం నయానో..భయానో చాలా మంది సినీ యాక్టర్లు వైసీపీ గూటికి చేరారు. కొందరు బాహటంగానే మద్దతు తెలిపి ఎన్నికల ప్రచారం చేశారు. నటుడు, నిర్మాత మోహన్ బాబు, పోసాని కృష్ణమురళీ, అలీ, థర్టీ ఈయర్స్ పృధ్విరాజ్, విజయ్ చందర్, భానుచందర్, కృష్ణుడు వంటి నటులు వైసీపీకి బాహటంగానే పనిచేశారు అగ్రనటుడు నాగార్జున సైతం తెరవెనుక వైసీపీ విజయానికి కృషి చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సినీ యాక్టర్లకు గుర్తింపుఅంతంతమాత్రమే. రోజాకు నగిరి సీటిచ్చారు. కానీ ఆమె రెండుసార్లు బోటాబోటీ మెజార్టీతో బయటపడ్డారు. మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల దృష్ట్యా తొలి కేబినెట్ లో దక్కలేదు. విస్తరణలో మాత్రం చోటు దక్కించుకున్నారు. అయితే జగన్ ముందుగా గుర్తింపు ఇచ్చింది మాత్రం థర్టీ ఈయర్స్ పృధ్వీనే. ఏకంగా ఎస్వీసీబీసీ చానల్ చైర్మన్ చేశారు. కానీ ఆయన లైంగిక వేధింపులతో పదవి పొగొట్టుకున్నారు. వైసీపీకి దూరమయ్యారు. త్వరలో జనసేనలో చేరనున్నట్టు ప్రకటించారు.
అయితే రోజా, పృధ్వీకి తప్ప సినీ రంగానికి చెందిన వారికి వైసీపీ ప్రభుత్వంలో గత మూడున్నరేళ్లుగా ఎటువంటి పదవులు దక్కలేదు. దీంతో ఒకరకమైన విమర్శ ప్రారంభమైంది. జగన్ వాడుకొని వదిలేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే మోహన్ బాబు వైసీపీకి దూరంగా జరిగారు. పార్టీ అంటే అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై విమర్శలు చుట్టుముట్టడంతో జగన్ సర్కారు అప్రమత్తమైంది. ఒక్కో నటుడికి పదవులు కట్టబెడుతూ వస్తోంది. అలీకి ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించగా.. తాజాగా పోసాని కృష్ణమురళీకి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. అయితే అలీ కంటే కృష్ణమురళీకి ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అయితే పార్టీలో వాయిస్ బట్టే పదవులు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో థర్టీ ఈయర్స్ పృధ్వి మంచి జోరు మీద ఉండేవారు. చంద్రబాబు, పవన్ లపై ఓ రేంజ్ లో విమర్శలు చేసేవారు. వాటినే గుర్తించుకున్న జగన్ పృధ్వీస్థాయికి మించి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అటు పోసాని కృష్ణమురళీ కూడా పవన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. సినిమాల్లో చాన్స్ లు సైతం వదులుకున్నరే తప్ప విమర్శలు చేయడం మానలేదు. అందుకే ఆయనకు మంచి పదవి దక్కిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారిద్దరితో పోల్చుకుంటే అలీ ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయలేదు. అందుకే వందలాది మంది సలహాదారుల్లో ఒక పదవి కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు.
ఇక తనకు అత్యంత సన్నిహితుడైన నాగార్జునను వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ చూస్తున్నారు. అయితే ఎప్పుడూ తెర వెనుక రాజకీయాలు చేసే నాగార్జున అందుకు సమ్మతిస్తారా? లేదా? అన్నది అనుమానమే. అయితే మోహన్ బాబు పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు. అటు తాను చంద్రబాబుకు దగ్గరవుతున్న సంకేతాలిచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీలో మిగిలింది ఓన్ అండ్ ఓన్లీ కృష్ణుడు. చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందారు కృష్ణుడు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. త్వరలో కృష్ణుడికి ఒక మంచి పదవి కేటాయించి సినిమారంగానికి తగిన ప్రాధాన్యమిచ్చినట్టు మెసేజ్ పంపించాలని జగన్ భావిస్తున్నారుట. సో త్వరలో కృష్ణుడికి కూడా పదవి లభించనుందన్న మాట.