Sonu Sood Meets Arvind Kejriwal: కరోనా మహమ్మారి మొదటి దశ నుంచి.. సేవాకార్యక్రమాలు మొదలు పెట్టి.. భారతదేశపు నిజమైన హీరోగా వెలుగొందుతూ వస్తున్నాడు సినీ నటుడు సోనూసూద్. ప్రభుత్వ అధికారం చేతిలో ఉన్న నేతలు కొవిడ్ బాధితుల గురించి పట్టించుకోవట్లేదని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన వేళ.. సోనూసూద్ చేస్తూ వచ్చిన సహాయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడే ఒక సైన్యంలా సోనూసూద్ అందించిన, అందిస్తున్న సహకారానికి ప్రతిఒక్కరూ హ్యాట్సాప్ చెప్పారు.
అయితే.. ప్రతి మంచిలోనూ చెడును చూసేవాళ్లు ఉన్నట్టే.. సోనూ సొంతప్రాపకం కోసమే ఇదంతా చేస్తున్నాడని అనుమానించిన వారు కూడా ఉన్నారు. సోనూ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడని, దానికోసమే ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటున్నాడని కూడా అన్నారు. సోనూ సేవలకు ముగ్ధులైన బాలీవుడ్ నటి రాఖీసావంత్ వంటివాళ్లు.. ‘భవిష్యత్ ప్రధాని’ అంటూ సంబోధించారు కూడా. అయితే.. తాను మాత్రం ఒక సామాన్యుడిలాగనే సేవ చేశానని, తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పాడు సోనూ. అయితే.. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.
కేజ్రీవాల్ తో సమావేశం అనంతరం వీరిద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ సర్కారు ప్రారంభించబోతున్న ‘దేశ్ కే మెంటార్స్’ ప్రోగ్రామ్ కు సోనూను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. అనంతరం సోనూ మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థులకు మెంటార్ గా వ్యవహరించే ఛాన్స్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. అయితే.. ప్రస్తుతానికి ఇదే కార్యక్రమం కావొచ్చేమోగానీ.. సోనూకు కండువా కప్పేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తోందని అంటున్నారు. అంతేకాదు.. త్వరలో సోనూ సూద్ సోదరి ఆప్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి.. పంజాబ్ లోనూ బలం ఉంది. ఆ బలాన్ని అధికారం సాధించేంతగా పెంచుకోవాలని ఆప్ ఆరాటపడుతోంది. సోనూ తమ వెంట నిలిస్తే.. పంజాబ్ లో ఇది సాధ్యమేనని కేజ్రీవాల్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ్ కే మెంటార్స్ ప్రోగ్రామ్ కు సోనూను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం కాకతాళీయం కాకపోవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.
పైగా.. సోనూ సొంత రాష్ట్రం పంజాబ్. మోగా పట్టణంలోనే సోనూ పుట్టి పెరిగారు. కాబట్టి.. సోనూ రంగంలోకి దిగితే పంజాబ్ ఆప్ వశం కావడం సాధ్యమేననే అభిప్రాయంలో ఆప్ ఉందని అంటున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో మోగా నియోజకవర్గంలో ఆప్ తరపున సోనూ సోదరి మాళవిక సచార్ బరిలోకి దిగనున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోనూ-కేజ్రీవాల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. సోనూ సన్నిహితులు మాత్రం కేవలం దేశ్ కే మెంటార్స్ ప్రోగ్రామ్ కోసమే వీరు కలుసుకున్నట్టు చెబుతున్నారు. మరి, వాస్తవం ఏంటన్నది చూడాలి.