మోడీ (PM Narendra modi) వేవ్ తో బీజేపీ రెండు సార్లు కేంద్రంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. 2024లో తిరిగి మూడోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ఈ సారి ఎలాగైనా బీజేపీని ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి విపక్షాలు. ఇందుకోసం కలిసి కట్టుగా పనిచేయాలని భావిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతోంది.
ఎన్నికల నాటికి థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందా? కాంగ్రెస్ తో కూడిన సెకండ్ ఫ్రంటే పోరుకు సిద్ధమవుతుందా? అన్నది ఇప్పుడే తెలియదుగానీ.. బీజేపీ వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కాబోతున్నాయని అర్థమవుతోందని అంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ఈ విషయంలో ముగ్గురు బలంగా పట్టుబడుతున్నారు. వారిలో సోనియా (Sonia gandhi), మమతా బెనర్జీ (mamatha), శరద్ పవార్ (sharad pawar) కనిపిస్తున్నారు.
పడిపోయిన కాంగ్రెస్ ను తిరిగి లేపాల్సిన అవసరం సోనియాకు చాలా ఉంది. బెంగాల్లో తనను టార్గెట్ చేసిన బీజేపీని దెబ్బ తీయాలని మమతా బెనర్జీ రగిలిపోతున్నారు. అటు శరద్ పవార్ సైతం బీజేపీని ఢీకొట్టి అవకాశం ఉంటే.. పీఎం కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నారు. ఈ విధంగా బీజేపీపై పోరుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. గత కొంత కాలం నుంచే జరుగుతున్న విపక్షాల ఏకీకరణ కార్యక్రమానికి.. పార్లమెంట్ సమావేశాలు కలిసి వచ్చాయి.
పెగాసస్, వ్యవసాయ చట్టాలు ఇతరత్రా అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టడంలో విపక్షాలు పైచేయి సాధించాయి. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ సాఫ్ట్ వేర్ తో దేశంలోని విపక్ష నేతలు, జర్నలిస్టులు, సుప్రీం న్యాయమూర్తుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేసినా.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని కోరినప్పటికీ.. మోడీ నోరు మెదపలేదు. చివరకు ఈ అంశంపై సుప్రీంలో విచారణ మొదలైంది.
ఈ విధంగా కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. మొన్న రాహుల్ గాంధీ 14 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, మోడీ సర్కారును ఎదుర్కోవాల్సిన వ్యూహంపై చర్చించారు. తాజాగా కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ నివాసంలోనూ విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 20న మరోసారి సమావేశం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. సోనియా, మమత, పవార్, స్టాలిన్, హేమంత్ సోరెన్, ఉద్దవ్ ఠాక్రే లతో భారీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తానికి మోడీని ఢీకొట్టడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి, విపక్షాల ఐక్యత ఎంత కాలం కొనసాగుతుంది? ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారు? అనే శేష ప్రశ్నలైతే మిగిలే ఉన్నాయి మరి!