https://oktelugu.com/

Crime News : కొడుకా వాడు.. పుట్టనేమి వాడు.. గిట్టనేమి?

వెంకటరమణారెడ్డి వృద్ధుడు కావడంతో.. తన కొడుకును వారించలేకపోయాడు. అతడు అలాగే మంచంలో కూర్చుని భయంతో వణికిపోయాడు. శ్రీనివాసులు రెడ్డి తన తల్లిపై చేసిన దాడికి సంబంధించి చుట్టుపక్కల వారు ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియోను పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. దీంతో మదనపల్లి టౌన్ సిఐ యువరాజు ఆ దంపతులను పరామర్శించారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 08:32 AM IST
    Follow us on

    Crime News : పుత్రుడు అంటే తల్లిదండ్రులకు పున్నామ నరకం నుంచి తప్పించేవాడు. వృద్ధాప్యంలో అండగా ఉండేవాడు. చరమాంకంలో సపర్యలు చేసేవాడు. కానీ పాపం ఆ తల్లిదండ్రులకు కన్న కొడుకు బతికుండగానే పున్నామ నరకం చూపిస్తున్నాడు. ఏ తల్లి కడుపులో నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చాడో.. ఆ కడుపు మీదే తన్నాడు. ఏ భుజాల మీద అయితే అతడు కూర్చున్నాడో.. ఆ భుజాలను తన చేతులతో కొట్టాడు.. అంతలా కొడుతున్నప్పటికీ.. దుర్భాషలు ఆడుతున్నప్పటికీ.. ఆ తల్లి ఏడుస్తోందే తప్ప.. కొడుకు ను పల్లెత్తు మాట అనడం లేదు. అదీ తల్లి ప్రేమంటే. అంతలా కొడుతున్నప్పటికీ.. అంతలా తిడుతున్నప్పటికీ.. తల్లి తన మమకారం చూపింది తప్ప.. తిరిగి దాడి చేయలేదు. దుర్భాషలాడలేదు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరు గట్టు వారి పల్లె అయోధ్య నగర్ లో వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ అనే దంపతులు జీవిస్తున్నారు. వీరి కుమారుడి పేరు శ్రీనివాసులురెడ్డి. అతడికి పెళ్లయింది, పిల్లలు కూడా కలిగారు. భూ పంపిణీకి సంబంధించి శ్రీనివాసులు రెడ్డి, వెంకట రమణారెడ్డి దంపతులకు కొద్దిరోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం శ్రీనివాసులు రెడ్డి తన తల్లిదండ్రులు ఉండే ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే తల్లి లక్ష్మమ్మ మీద దాడి చేశాడు. బూతులు తిడుతూ కడుపులో తన్నాడు. పిడికిలితో భుజంపై కొట్టాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆ తల్లి కింద పడిపోయింది. ఆ నొప్పులకు తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టింది.

    వెంకటరమణారెడ్డి వృద్ధుడు కావడంతో.. తన కొడుకును వారించలేకపోయాడు. అతడు అలాగే మంచంలో కూర్చుని భయంతో వణికిపోయాడు. శ్రీనివాసులు రెడ్డి తన తల్లిపై చేసిన దాడికి సంబంధించి చుట్టుపక్కల వారు ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియోను పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. దీంతో మదనపల్లి టౌన్ సిఐ యువరాజు ఆ దంపతులను పరామర్శించారు. దాడికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం లక్ష్మమ్మ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనతో నీరు గట్టు వారి పల్లె అయోధ్య నగర్ లో కలకలం రేగింది. భూమి పంపిణీకి సంబంధించి కొద్దిరోజులుగా శ్రీనివాసులు రెడ్డి వెంకటరమణ రెడ్డి, లక్ష్మమ్మ దంపతులను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు కు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.