ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియామకం అయిన సోము వీర్రాజు ప్రభుత్వంపై, ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక టాపిక్ తీసుకొని ఇరు పార్టీలనూ ఆడుకుంటున్నారు. తాజాగా.. మరోసారి ఆయన ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఇరువురిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి విమర్శలు చేశారు.
Also Read: ఉప ముఖ్యమంత్రికి కరోనా
మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ స్పష్టంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఏమన్నారంటే.. దార్శనికుడైన నారా చంద్రబాబు నాయుడు 1800 రోజులు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం సహకరించలేదని.. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వమూ సహకరించడం లేదని వాపోయారు. అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
అమరావతిలో తొమ్మిది వేల ఎకరాలను చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా ఎందుకు చేయలేదన్నారు. అక్కడి 64 వేల ప్లాట్లు రైతులకు ఇవ్వాలని, 9 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎయిమ్స్‌ను తక్కువ ఖర్చుతో కేంద్రం నిర్మించి ఇచ్చిందని.. అయినా నాటి.. నేటి ప్రభుత్వాలు కనీసం రోడ్డుకు కూడా స్థలం చూపించలేదని అన్నారు.
Also Read: ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ ప్రారంభం
రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీలు ప్రజలను మోసం చేశాయన్నారు. వైసీపీ కూడా నమ్మించి మోసం చేసిందని పేర్కొన్నారు. హైకోర్టు రాయలసీమలో ఉండాలనే తమ విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. జగన్ కూడా గొప్పలు చెప్పుకోవడం మానేసి చేతల్లో చూపించాలని హితవు పలికారు. అవినీతి విషయంలోనూ ఇరు పార్టీలు సమానమేనని ఆరోపించారు. స్థలాల పంపిణీ పేరుతో కోట్లాది రూపాయలు వృథా చేశారన్నారు. పోలవరం విషయంలోనూ వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని పేర్కొన్నారు. తమకు టీడీపీ, వైసీపీ రెండూ సమానమేనని చెప్పుకొచ్చారు.