Somu Veerraju: పొత్తులపై బీజేపీ తేల్చేసింది. ఏపీ బీజేపీ వైఖరి పై స్పష్టతనిచ్చింది. బీజేపీ కోసం ఎదురుచూసిన టీడీపీ, జనసేనకు క్లారిటీ వచ్చినట్టయింది. 2024లో ఎవరితో వెళ్తున్నామో తేల్చిచెప్పింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనతో సంధిగ్ధతకు తెరపడింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కీలక ప్రకటన చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో కుటుంబ, వారసత్వ, అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంటూ, వాటిపై పోరాటానికి సమరశంఖం పూరిస్తామని తెలిపారు. వారసత్వ కుటుంబ రాజకీయాలు కూల్చడమే తమ ధ్యేయమని ప్రకటించారు. 2014 తర్వాత ఏపీలో అవినీతి తప్పా మరేమీ లేదన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతిని బయటపెడతామన్నారు. జగన్ సంక్షేమం ఎక్కువా ? మోడీ సంక్షేమం ఎక్కువా ? అని ప్రశ్నించారు.
ఏపీలో బీజేపీతో కలిసి వెళ్లడానికి టీడీపీ, జనసేన సిద్ధమైనప్పటికీ.. ఇన్నాళ్లూ బీజేపీ నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పొత్తుల అంశం పై స్పష్టత వచ్చింది. బీజేపీ పొత్తు రాష్ట్రంలోని ప్రజలతోనేనని సోమువీర్రాజు ప్రకటన చేశారు. దీంతో జనసేన, టీడీపీ ఎదురుచూపులకు సమాధానం వచ్చిందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని సోము వీర్రాజు చెప్పకనే చెప్పారు. బీజేపీ ప్రకటన పై టీడీపీ, జసేనలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
జీవో నెంబర్ 1 పై కూడా సోమువీర్రాజు స్పందించారు. జీవో నెంబర్ 1 పై జగన్ వైఖరి సరికాదని చెప్పారు. అప్పటి ప్రభుత్వాలు ఇలానే చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా ? అంటూ ప్రశ్నించారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. అద్దెగదుల ధరల పెంపు పై త్వరలో చలో తిరుపతి నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా లక్ష ప్రజా చార్జిషీట్లతో ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు.

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఏపీ రాజకీయాలు మలుపు తిరిగాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. టీడీపీ, జనసేనతో కలిపి బీజేపీని తీసుకెళతానని అన్నాడు. తెలంగాణలోనూ బీజేపీ కలిసి వస్తే తాజాగా కలుపుకుపోతానని జనసేనాని క్లారిటీ ఇచ్చాడు.. కానీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నుంచి పొత్తులపై ఎలాంటి ఆసక్తి కనపడలేదు. బీజేపీ కార్యవర్గ భేటిలో పవన్ ప్రస్తావన రాలేదు. సో ఏపీలో జనసేనతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా లేదని అర్థమవుతోంది. ఈ పరిణామం అధికార వైసీపీకి కలిసి వచ్చేలా ఉంది. పెద్దగా బలం లేని బీజేపీ ఒంటరిపోరుకు యోచిస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చేవారితో ఫలితాల తర్వాత మద్దతు తీసుకునే ఎత్తుగడ వేస్తోంది.