Modi Somu Veeraju: ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ముందుగా స్టేట్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మోదీ, అమిత్‌షా ఎక్కడికి వెళ్లినా.. ముందుగా కార్యకర్తలను కలుస్తారు. ఈ సంప్రదాయం బీజేపీలోనే ఉంది. ఆ పార్టీకి ఇదే పెద్ద ప్లస్‌పాయింట్ కూడా. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ… శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్రనేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడబడ్డారు. మరోవైపు ప్రధానికి తనను తాను పరిచయం చేసుకున్నారు.
వాట్ ఎబౌట్ యూ..
ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా మందిని గుర్తించలేదు. ఎదుగుతున్న యువ నేతల్ని గుర్తించకపోతే.. సరే అనుకోవచ్చు కానీ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా గుర్తించకపోవడం అనూహ్యంగా మారింది. సమావేశం ప్రారంభంలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలని అందర్నీ కోరారు. దీంతో సోము వీర్రాజు లేచి అందరినీ పరిచయం చేయించబోయాడు. వెంటనే మోదీ ‘సెల్ఫ్ ఇంట్రడ్యూస్ కరో అని అడగడంతో సోము వీర్రాజు అవాక్కయ్యారు. తనను ప్రధాని గుర్తించలేదని అర్థం చేసుకున్న వీర్రాజు వెంటనే పరిచయం చేసుకున్నారు. అప్పుడే మోదీ.. మీరు ఏం చేస్తుంటారని ప్రశ్నించడంతో సోము మరింతగా అవాక్కయ్యారట. తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడినని.. చెప్పుకున్నారు. అప్పుడు మోదీ.. ‘‘నువ్వు నాకు నచ్చావ్ సినిమా ప్రకాశ్‌రాజ్ తరహాలో.. అది సరే.. రాజకీయాలతోపాటు ఇంకా ఏమీ చేస్తారు’’ అని ప్రధాని ఆరా తీశారు. దీంతో, ఒక దశలో సోము తడబడినా తనకు ఏమీ లేదు సార్ అంటూ సమాధానమిచ్చారు. వ్యవసాయం.. వ్యాపారం వంటివి లేవా అని ప్రధాని ప్రశ్నించారు. తనకు ఏమీ లేవని సోము వీర్రాజు బదులిచ్చారు. ‘ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటూ ప్రధాని ప్రశ్నించగా, సోము వీర్రాజు 21 జిల్లాలని సమాధానం ఇచ్చారు. పక్కనే ఉన్న నేతలు 26 అంటూ సరిచేశారు.
పార్టీని బలోపేతం చేయండి..
గుజరాత్‌లో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేశామో ప్రధాని ఏపీ కోర్ కమిటీ మీటింగ్‌లో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు బలపడటం లేదని ప్రశ్నించారు. దీంతో కొందరు నేతలు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ తనవిగా సీఎం జగన్ ప్రచారం చేసుకొంటున్నారని ప్రస్తావించారు. కేంద్ర అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రధాని నిర్దేశించారు. మహిళలు..యువతకు దగ్గరయ్యేలా వారితో మమేకం అయ్యే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి సంపూర్ణ పోషణ అదుతుందో లేదో చూడాలని, గ్రామాల్లో ఎక్కడికక్కడ స్థానిక క్రీడలు యువతతో కలిసి ఆడాలని పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లడానికి ఇదొక మంచి అవకాశమని ప్రధాని వివరించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్ల నిర్మాణం ఏపీలో సరిగా జరగడం లేదని, నిధులిస్తున్నా నిర్మించి ఇచ్చేందుకు వాళ్లకు ఇబ్బందేంటని.. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని ప్రధాని పార్టీ నేతలను ఆదేశించారు.