TDP Janasena Alliance Somu Veeraju: ఏపీలో పచ్చటి సంసారాన్ని చూస్తే ఎందుకో ఆ ‘పచ్చ’ పార్టీ అధినేతకు కంఠగింపుగా మారింది. ఆ పచ్చటి సంసారంలో నిప్పులు పోసేందుకు ‘బాబు’ గారు రెడీ అయ్యారట.. నాతో కలవకుండా ఆ కాషాయదళంతో కలిసి వెళుతున్న ‘పవనాలు’కు ప్రేమ లేఖలు రాస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కొత్త పొత్తులకు తెరతీస్తున్నారు. పవన్, చంద్రబాబు కలిస్తే తప్పులేదు.. కానీ మధ్యలో ఉన్న బీజేపీకి ఏపీ ఇంట్లోనే ఉప్పు పుట్టదు. అందుకే తమ మిత్రుడు పవన్ చేజారిపోకుండా ఇప్పుడు ఏపీ బీజేపీ రంగంలోకి దిగిందట.. ఈ మేరకు చంద్రబాబు కుట్ర సిద్ధాంతాలను సోము వీర్రాజు వల్లె వేస్తూ పవన్ ను కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
2024కు ఏపీ రాజకీయం ఎలా ఉంటుందో అస్సలు ఊహించని విధంగా మారింది. పొత్తుల ఎత్తుల్లో ఎవరు ఎవరితో కలుస్తారో ఊహకందడం లేదు.. పవన్ పై చంద్రబాబ ప్రేమ.. బీజేపీకి శాపంగా మారుతుందా? జనసేన-బీజేపీ మిత్రత్వం చంద్రబాబు వల్ల శత్రుత్వానికి దారితీస్తుందా? వాళ్లిద్దరి పవిత్రబంధంలో చంద్రబాబు పుల్లలు పెడుతాడా? ఇప్పుడు ఇవే భయాలు ఏపీ బీజేపీలో వెంటాడుతున్నాయట.. చంద్రబాబు పొత్తుల ఎత్తుల్లో తమ అడ్రస్ ఎక్కడ గల్లంతవుతుందన్న ఆందోళన బీజేపీ నేతలను వెంటాడుతోందట.. ఇప్పటికే సోము వీర్రాజు ఈ మధ్య పవన్ పై కామెంట్ చేయడం.. ఇప్పుడు చంద్రబాబు అదే పవన్ పై ప్రేమ కురిపించడంతో ఎవరి బంధాలు ఎవరితో కలుస్తాయోనన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు ఆఫర్ ఏపీ బీజేపీని కలవరపెడుతోంది.
40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబుకు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. అందుకే తాజాగా పావురాలతో జనసేనానికి ప్రేమ కబురు పంపాడు. అయితే కబురుకు పవన్ స్పందిస్తే ప్రేమ చిగురిస్తుంది.. లేదంటే కాలదన్నుతుంది. ఏదైనా చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నష్టమల్లా కేవలం బీజేపీకే.. ఎందుకంటే ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. వాళ్లిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు వీరి బంధాన్ని విడదీయాలని.. తనతో జనసేనను కలుపుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఏపీ బీజేపీని కలవరపెడుతున్నాయి.
చంద్రబాబు తాజాగా కుప్పం పర్యటనలో హాట్ కామెంట్స్ చేశారు. ‘మనం జనసేనను ప్రేమిస్తున్నాం కానీ.. వాళ్లు కూడా మనల్ని ప్రేమించాలి కదా.. వన్ సైడ్ లవ్ పనికిరాదు’ అని పవన్ తో పొత్తుపై చంద్రబాబు ఆసక్తి కనబరిచాడు.
అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడే మొదలైంది. చంద్రబాబు పవన్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయడంతో ఏపీ బీజేపీ అలెర్ట్ అయ్యింది. వెంటనే బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ అని.. లవ్ చేసి వదిలేస్తాడని.. వాళ్లు ఎటూ కాకుండా పోతారని హెచ్చరించారు. చంద్రబాబు అవసరమైనప్పుడే లవ్ చేస్తాడని.. ఆ తర్వాత ఏం చేస్తాడో నోటితో చెప్పను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవకాశవాదానికి చిరునామా అయిన చంద్రబాబును నమ్మి ఎవరూ మోసపోరన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షం కొనసాగుతుందని ప్రకటించారు.
అలా చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ ఇంతవరకూ స్పందించలేదు. కానీ ఆయన మిత్రపక్షం బీజేపీ మాత్రం తాము పవన్ ను వదిలేది లేదని చెబుతోంది. మరి వీరి పొత్తుల సంసారం ఎటు దారితీస్తుందో వేచిచూడాలి.