https://oktelugu.com/

Somu Veerraju- Atmakuru By-Election: ఆత్మకూరులో బీజేపీకి గౌరవం దక్కేనా? గట్టి ప్రయత్నమే చేస్తున్న సోము వీర్రాజు

Somu Veerraju- Atmakuru By-Election: ఏపీలో బలోపేతం కావడంపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టు అడుగులు వేస్తోంది. కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. తెలంగాణతో పోలిస్తే గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు. కానీ మిగతా రాష్ట్ర నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం సహకారం కొరవడుతోంది. రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా బీజేపీ […]

Written By: Dharma, Updated On : June 18, 2022 10:18 am
Follow us on

Somu Veerraju- Atmakuru By-Election: ఏపీలో బలోపేతం కావడంపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టు అడుగులు వేస్తోంది. కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. తెలంగాణతో పోలిస్తే గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు. కానీ మిగతా రాష్ట్ర నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం సహకారం కొరవడుతోంది. రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా బీజేపీ కలబడుతోంది. అభ్యర్థులను నిలబెడుతోంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఓట్లు రాబెట్టుకోలేకపోతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడ లోపం? అన్నది గుర్తించలేకపోతోంది. తాజాగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ పరిస్థితి ‘ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లు’గా ఉంది. రెండున్నర దశాబ్దాల క్రితం గెలుపు అంచు వరకు ఓట్లు సాధించిన ఆ పార్టీ భావసారూప్యం లేని పార్టీలతో జతకట్టి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ కనీస ఓట్లను రాబట్టుకోలేపోయింది. రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామంటూ బీరాలు పలికి చతికిల పడింది. ఇప్పుడు ఆత్మకూరులోనూ నేల విడిచి సాము చేసిన పరిస్థితి కనిపిస్తోంది.

Somu Veerraju- Atmakuru By-Election

Somu Veerraju

గత ఎన్నికల్లో..
ఆత్మకూరులో గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులకు ఇంచుమించు రెండు.. మూడు వేల ఓట్లు కూడా పోల్‌ కాలేదు. వరుస ఓటమిలను చవిచూస్తున్నా.. గుణపాఠాలు నేర్వడం లేదు. ఉత్తరాది నేతల పెత్తనంతో స్థానికంగా ఉన్న పరువు కూడా గంగలో కలుస్తోందని ఆ పార్టీ నేతలే బాహాటంగా అభిప్రాయ పడుతున్నారు.తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ గెలిచిన ధీమాతో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో సైతం కాషాయ జెండా ఎగురువేస్తామంటూ నేతలు బీరాలు పలికారు. జాతీయ స్థాయి నేతలతో తాహతుకు మించి ప్రచారం చేసినా అక్కడి ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఆ తర్వాత బద్వేలు ఉప ఎన్నికల్లో సైతం అదే ఫలితం దక్కింది. ఈ పరిస్థితులల్లో ఆత్మకూరులో బరిలో నిలవకపోవడం మంచిదని జిల్లా నాయకత్వం సూచించింది. వీరి సూచనను పరిగణలోకి తీసుకుండా అభ్యర్థిని పోటీలో నిలుపుతామని అధిష్టానం ప్రకటించింది. పార్టీ నాయకత్వ నిర్ణయం, అభ్యర్థి ఎంపిక ఆ పార్టీ పరిస్థితి బేజారుగా మారింది.

Also Read: AP BJP: ఏపీలో రూటు మార్చిన బీజేపీ.. టీడీపీ నేతలపై గురి

నాన్ లోకల్ అభ్యర్థి..
ఉప ఎన్నికల్లో తమ నిర్ణయానికి వ్యతిరేకంగా నాన్‌లోకల్‌ వ్యక్తిని అభ్యర్థిగా నిలపడంపై ఆ పార్టీ శ్రేణులు నిర్లిప్తంగా ఉన్నాయి. పోటీలో 14 మంది ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీకి మాత్రమే రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు చెందిన నాయకులు ఆత్మకూరులో తిష్టవేసి ప్రచారంలో మునిగిపోయారు. అయితే అభ్యర్థి భరత్‌కుమార్‌ నాన్‌లోకల్‌ అనే విషయం అడుగడుగునా వినిపిస్తోంది. ఎక్కడికెళ్లినా ప్రజా మద్దతు దక్కకపోవడంతో ఒకింత ఆవేదన బీజేపీ నేతల్లో గూడు కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు బీజేపీ నేతలు సైతం సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థి భరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీలో ఉత్తరాది నేతల పెత్తనంతో సిద్ధాంతాలు గాలిలో కలిసిపోయాయి. వాపును చూసి బలం అనుకోవడంలో వారికి వారే సాటిగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బలం లేకపోయినప్పటికీ దుబ్బాక ఫలితం పునరావృతం అవుతోందని అటు తిరుపతి, ఇటు బద్వేలులో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ ఊదరగొట్టారు. తాజాగా ఆత్మకూరు బరిలో నిలిచి అదే తరహా ప్రచారాల్లో మునిగిపోయారు.

Somu Veerraju- Atmakuru By-Election

Atmakuru By-Election

సానుభూతి ఫీవర్..
ఆత్మకూరులో బీజీపీని నాన్‌లోకల్‌ ఫీవర్‌ వెంటాడుతుంది. ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏ నేత సుముఖంగా లేకపోవడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న గుండ్లపల్లి భరత్‌కుమార్‌ను ఆఖరి క్షణంలో రాష్ట్ర అధిష్టానం పెద్దలు బరిలో నిలిపారు. అయితే భరత్‌కుమార్‌ ఆత్మకూరుకు స్థానికేతరుడు కావడంతో స్థానిక నేతలే నిర్లిప్తంగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ ఘోరంగా ఓటమి చేసి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీకి పోల్‌ అయిన ఓట్లలో కేవలం 1.33 శాతం అంటే 2,314 ఓట్లు మాత్రమే వచ్చాయి.తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలు ఒక విషాదకరమైన పరిస్థితుల్లో వచ్చాయి. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దివంగతులు కావడంతో ఆ స్థానంలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఓట్లు లభిస్తాయా? కనీసం పరువు నిలుస్తుందా? అని బీజేపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ నుంచి అభ్యర్థి ఎంపిక వరకు జిల్లా నాయకత్వంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పరువు కాపాడుకునేందుకు కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు పార్టీ శ్రేణులు తిష్టవేశాయి.

Also Read:Unemployed in AP: జాబు లేదు..కేలండర్ లేదు.. ఉద్యోగాల భర్తీని మరిచిన ఏపీ సర్కారు

Tags