Somu Veerraju Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ మరోసారి పీటం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా.. ప్రతిపక్షాలు మాత్ర ఆ అవకాశం ఇవ్వకుండా రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఒంటరిగా కాకుండా పొత్తులతో ఎన్నికల్లోకి వెళ్లి ఆ ఛాన్స్ ఇవ్వొద్దని వ్యూహం పన్నుతున్నాయి. ఇందులో భాగంగా జనసేనతో కలిసి బీజేపీ పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తు విషయంపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపిని ఓడించేందుకు పొత్తులు ఉంటాయని అన్నారు. అయితే దీనిపై జనసేన అధినేత ఏ విధంగా స్పందిస్తాడోనని ఆసక్తిగా మారింది.
ఇటవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆ తరువాత పొత్తులపై క్లారిటీ ఇస్తామని అన్నారు. దీంతో తాజాగా సోము వీర్రాజు చేసిన కామెంట్లకు ప్రాధాన్యం చేకూరాయి. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ జనసేన పార్టీతో తమకు ఇప్పటికే పొత్తు ఉందని, ప్రస్తుతానికి ఇంకెవరితో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదన్నారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని.. కానీ మరొకరితో కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. గత కొంతకాలంగా జనసేన, బీజేపీల మధ్య పొత్తు విషయంపై సందిగ్ధం నెలకొన్న సమయంలో సోమువీర్రాజు స్పష్టం చేయడంతో పొత్తులపై క్లారిటీ వచ్చినట్లయింది.
అయితే జనసేన మాత్రం కేవలం బీజేపీతోనే కాకుండా టీడీపీని కూడా కలుపుకుపోయే అవకాశం ఉంది. 2014 తరహాలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి పవన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే 2019లో టీడీపీ అధినేత బాబు ప్రధాని లక్ష్యంగా మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్తోనూ జత కట్టారు. దీంతో ఆ సమయంలో మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కానీ పవన్ టీడీపీతో కూడా తమ పొత్తు ఉంటుందన్న వ్యాఖ్యలపై బీజేపీ ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. అయితే సందర్భాన్ని బట్టి నడుచుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తిరుపతి ఎన్నికల తరువాత బీజేపీ, జనసేనలు ఎవరి దారి వారే అన్నట్లుగా వ్యవహరించారు. బద్వేల్ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకోగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో ఇరు పార్టీలు ఇక దూరం అయినట్లేనని అనుకున్నారు. కానీ ఇటీవల జనసేన ఆవిర్భావ సభ తరువాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీని గద్దె దించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. అవసరమైతే కమ్యూనిస్టులను కూడా కలుపుకోవచ్చని పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అటు వైసీపీ కూడా ప్రతిపక్షాలన్ని పోటీ చేసిన తన ఓటు బ్యాంకు పై ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్షాలలన్నీ ఒకే తాటిపైకి వస్తే సీట్ల విషయంలో వివాదాలు ఏర్పడి కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో తిరిగి వైసీపీకి లాభం చేకూరవచ్చని అంటున్నారు. అయితే ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి.