
దేశ ప్రధాన మంత్రి జీవితం ఎంతో ఖరీదుగా ఉంటుంది. దీంతో.. అదంతా వ్యక్తిగత వ్యయంగా భావిస్తూ.. పీఎం జీవితం విలాసంగా ఉంటుందని అనుకుంటారు చాలా మంది. కానీ.. నిజానికి ప్రధానమంత్రి ఆహారం నుంచి దుస్తుల వరకు అన్నీ అలవెన్సులుగానే ఉంటాయి. ఇది తెలియనివారు.. పీఎం ఆస్తులు ఎంతో ఉంటాయని భ్రమించే అవకాశం ఉంటుంది. అందుకే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
పారదర్శకత కోసం ప్రతీ ఏటా ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్న మోడీ.. ఈ సారి కూడా ఆస్తులను వెల్లడించారు. గతేడాది (2020) ప్రకటించినప్పుడు ప్రధాని ఆస్తులు 2.85 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆస్తి మరో రూ.22 లక్షలు పెరిగింది. మొత్తం రూ.3 కోట్ల 7 లక్షలకు చేరింది ప్రధాని ఆదాయం. ఈ మేరకు తన తాజా డిక్లరేషన్లో మోడీ ప్రకటించారు.
మరి, మోడీ ఆదాయ వనరులు ఏవీ అన్నప్పుడు.. ఆయనకు ప్రత్యేకమైన వ్యాపారాలు ఏవీ లేవు. ఆయన పొందే జీతభత్యాలే ప్రధాన ఆదాయం. ఆయన వేతనాన్ని బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నారు. అందుకు గానూ వచ్చే వడ్డీని కూడా తిరిగి బ్యాంకులోనే జమ చేస్తున్నారు. ఆ విధంగా ప్రధాని ఆదాయంలో వృద్ధి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గుజరాత్ లోని గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో మోదీ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ బ్యాంకులో ప్రధాని పేరిట 1.86 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్స్ ఉన్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు 8.9 లక్షలు, ఎల్ ఐసీ పాలసీలు 1.5 లక్షలు ఉన్నాయి.
ఇంకా.. మోడీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ లక్షా 48 వేలు ఉంటుందని అంచనా. 2014లో ప్రధాని అయినప్పటి నుంచీ ఇప్పటి వరకు మోడీ ఏ విధమైన ఆస్తులు కొనుగోలు చేయలేదు. అంతేకాదు.. ప్రధానికి సొంతంగా ఎలాంటి వాహనం లేకపోవడం విశేషం.