Singareni – BRS : దొంగను దొంగ అంటే ఎప్పుడూ ఒప్పుకోడు.. కానీ ఇతరులను మాత్రం దొంగ అని కచ్చితంగా అనగలుగుతాడు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పరిస్థితి కూడా అలానే ఉంది. లోతుల్లోకి వెళ్లడం లేదు కానీ.. ప్రభుత్వం మీద ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు లేదా అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పుడు దానిని డైవర్ట్ చేయడం భారత రాష్ట్ర సమితికి పరిపాటిగా మారింది. శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో ఎప్పటిలాగే భారత రాష్ట్ర సమితి నిరసనలకు పిలుపునిచ్చింది. ఈసారి ఎత్తుకున్న నినాదం” సింగరేణి బచావో బిజెపి హఠావో”.. కానీ దీనిని చేసే ముందు భారత రాష్ట్ర సమితి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని బొగ్గు గనులు వేలం వేయొద్దని, సింగరేణిని తమకే అప్పగించాలని పట్టుబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏడు సంవత్సరాల క్రితమే సిరులు కురిపించే తాడిచర్ల బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కు కట్టబెట్టింది. తెలంగాణ జెన్కోకు కేటాయించిన ఈ బొగ్గు బ్లాక్ ను సింగరేణికి బదులుగా ఏఎంఆర్ కంపెనీకి 30 సంవత్సరాల పాటు ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి సర్కార్ హయాంలో జరిగిన ఈ బొగ్గు బాగోతం మరో 20 సంవత్సరాల పాటు దర్జాగా సాగుతుంది. వేల కోట్ల విలువైన బొగ్గు ప్రైవేటు కంపెనీ పరం అవుతుంది.
సింగరేణి గురించి పదేపదే మాట్లాడుతున్న భారత రాష్ట్ర సమితి నాయకులు ఈ ఏడు సంవత్సరాల లో సింగరేణి పరిరక్షణ కోసం ఏం చేశారో చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఒక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తన వాటా వదులుకుంటే సింగరేణి సంస్థను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మరి అంత ఆర్థిక సంపత్తి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తాడిచర్ల గనులను ఎందుకు ప్రైవేట్ పరం చేసిందో మాత్రం చెప్పడం లేదు.. వాస్తవానికి తాటిచెర్ల గనులు కేటాయించిన కంపెనీ కంటే.. సింగరేణికే ఉత్పాదక సామర్థ్యం ఎక్కువ. కానీ ఈ విషయాలను పక్కనపెట్టిన భారత రాష్ట్ర సమితి ప్రైవేట్ కంపెనీ కే ముగ్గు చూపడం విశేషం.
వాస్తవానికి 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాప్టివ్ మైనింగ్ కింద భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల బ్లాక్ ను జెన్కోకు కేటాయించింది. జెన్కోకు కేటాయించిన గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పి ఎల్ ఆర్ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడానికి నివసిస్తూ 2011లో కార్మిక సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేశాయి. ఇందులో అప్పటి టిఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో గొడవ జరిగిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య పి ఎల్ ఆర్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేశారు. అంతేకాదు తాడిచెర్ల గనుల్లో బొగ్గు తవ్వకాలు చేపట్టాలని సింగరేణి సిఎండికి లేఖ కూడా రాశారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తాడిచెర్ల మళ్ళీ ప్రైవేట్ పరం కావడం విశేషం. అసలు రాష్ట్ర ప్రభుత్వమే 2015లో జెన్కో ద్వారా ఏ ఎం ఆర్ కంపెనీకి ఈ బ్లాక్ ను అప్పగించడం విశేషం.
ఇక తాడిచర్ల ఓసి కోల్ మైనింగ్ చేపట్టాల్సిన జెన్ కో సంస్థ దానికి తగిన విధంగా ఉద్యోగులను నియమించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది.. అంతేకాదు మిషనరీ ఏర్పాటు, ఓపెన్ కాస్ట్ నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఏడాదికి 25 లక్షల టన్నుల బొగ్గును తరలించడం భారమని జెన్కో చేతులెత్తేసింది. కానీ ఇది సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ఇక్కడ విశేషం. ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పటికీ ఇక్కడ కన్వేయర్ బెల్ట్ నిర్మాణం జరగలేదు. ఇప్పటికీ 60 కిలోమీటర్లు లారీల ద్వారా చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు కు బొగ్గు రవాణా జరుగుతున్నది.
ఇక ఈ ఏఎం ఆర్ కంపెనీ 2018 నుంచి బొగ్గు సరఫరా మొదలుపెట్టింది. 2018_19 7.57 లక్షల మెట్రిక్ టన్నులు, 2019_20లో 16.55 లక్షల మెట్రిక్ టన్నులు, 2020_21లో 20.17 లక్షల మెట్రిక్ టన్నులు, 2021_22 లో థర్డ్ క్వార్టర్ ముగిసే నాటికి 16.64 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును చెల్పూర్ కేటీపీకి సరఫరా చేసింది. ఇక ఈ బ్లాక్ లో జి 7, జి8 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతుందని, ప్రతి టన్నుకు మూడు నుంచి 3500, ఒక్కోసారి టన్నుకు నాలుగు వేల వరకు జెన్కో నుంచి బిల్లు తీసుకుంటుంది. ఒకవేళ బొగ్గు గ్రేడ్ మారితే డబ్బులు చెల్లింపు పెరుగుతుంది. ప్రతి ఏటా పేమెంట్ విషయంలో అగ్రిమెంట్ మార్చుకునేలా రెండు సంస్థల మధ్య ఒప్పందం ఉంది. ఇలా నాలుగు సంవత్సరాలలోనే కోట్లల్లో దందా జరిగితే..26 సంవత్సరాలలో బొగ్గు దోపిడి ఏమేర జరుగుతుందో ఊహించుకోవచ్చు.
ఇక ఈ కంపెనీకి బొగ్గు బ్లాక్ ను అప్పగించడంతో నిర్వాసితులు నష్టపోయారు. ఏ ఎం ఆర్ సంస్థ 1400 మందిని తాత్కాలిక ఒప్పందంపై నియమించుకున్నది. వీరితో పనులు చేయిస్తోంది. దేవిరిలో భూ నిర్వాసితులు చాలా తక్కువగా ఉన్నారు. ఒకవేళ దీనిని సింగరేణికి గనుక అప్పగిస్తే కంపెనీ లాభాల్లో పయనించేది. జెన్కోకు కూడా నాణ్యమైన బొగ్గు లభించేది. ఇక రైతుల నుంచి సేకరించిన 913 హెక్టార్ల భూమిలో ఇక్కడ బొగ్గు తవకలు జరుగుతున్నాయి. కానీ తాడిచర్ల నుంచి చెల్పూర్ కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ కోసం భూసేకరణ పెండింగ్ ఉన్నట్టు ఏ ఎం ఆర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఓపెన్ కాస్ట్ కోసం 2,300 ఎకరాలు కన్వేయర్ బెల్ట్ కోసం సరిపడా స్థలాన్ని సేకరించకపోవడం మిస్టరీగా మారింది.
ఇక సింగరేణి సంస్థకు సంబంధించి గడచిన తొమ్మిది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు. పైగా సింగరేణి డబ్బులను వాడుకుంది. డివిడెండ్ డబ్బులు కూడా సొంత ఖాతాలకు మళ్ళించుకుంది. నేటికీ కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోంది. అంతేకాదు ప్రభుత్వ అజమాయిషి పెరగడంతో సింగరేణి సంస్థ ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. తెర వెనుక ఇంత దారుణం కనిపిస్తున్నప్పుడు.. ప్రభుత్వమే సింగరేణి సంస్థలు భ్రష్టు పట్టిస్తున్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తుంది? సింగరేణిని కాపాడాలంటూ ఎలా నినాదాలు చేస్తుంది? ఏదో ప్రధాని పర్యటన ఉంది కాబట్టి, నిరసన వ్యక్తం చేయాలి కాబట్టి, అర్జెంటుగా ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. అంతే. అంతకుమించి ఏమీ లేదు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Singareni brs brs love drama on singareni
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com