https://oktelugu.com/

కరోనా ఉపద్రవం లో సరిగమ పదనిసలు

అందరికి నమస్కారాలు. వారాంతం చాలా చాలా తొందరగా వచ్చేస్తుంది. ఈ వారం ప్రపంచం మొత్తం ఒకే వార్త. కోవిద్ 19 అనబడే కరోనా వైరస్ ఇంకా విజృంభించి దాదాపు 145 దేశాలకు పాకింది. చనిపోయినవాళ్లు 5 వేలకు పైమాటే. ఇది సోకిన వాళ్ళు ఒకటిన్నర లక్షదాటింది. చైనాలో కొంతమేర తగ్గుముఖం పట్టుందనుకుంటే మిగతా ప్రపంచం లో భయంకరంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ సోకిన మొదటి పదిహేను దేశాల్లో పది దేశాలు యూరప్ దేశాలే. అలాగే అమెరికా లో […]

Written By:
  • Ram
  • , Updated On : March 15, 2020 / 04:59 PM IST
    Follow us on

    అందరికి నమస్కారాలు. వారాంతం చాలా చాలా తొందరగా వచ్చేస్తుంది. ఈ వారం ప్రపంచం మొత్తం ఒకే వార్త. కోవిద్ 19 అనబడే కరోనా వైరస్ ఇంకా విజృంభించి దాదాపు 145 దేశాలకు పాకింది. చనిపోయినవాళ్లు 5 వేలకు పైమాటే. ఇది సోకిన వాళ్ళు ఒకటిన్నర లక్షదాటింది. చైనాలో కొంతమేర తగ్గుముఖం పట్టుందనుకుంటే మిగతా ప్రపంచం లో భయంకరంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ సోకిన మొదటి పదిహేను దేశాల్లో పది దేశాలు యూరప్ దేశాలే. అలాగే అమెరికా లో కూడా ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది. అదృష్టవశాత్తు మనదేశం ప్రపంచ దేశాల్లో చూస్తే 42 వ స్థానం లో వుంది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం మనం రెండో దశలో వున్నాం. ఇది మూడో దశకు వెళ్లకుండా చూసుకోగలిగితే బతికి బట్ట కట్టినట్లే. అందుకే ప్రభుత్వాలు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇతరదేశాలనుంచి వచ్చే వాళ్ళ వీసాలు రద్దుచేయటం. దీనితో సగం ప్రమాదం తప్పినట్లే. ఇక రెండోది ఇప్పటికే సోకినవాళ్లను , వాళ్ళు ఎవరెవరితో తిరిగారో , ఎక్కడెక్కడికి వెళ్లారో గుర్తించి వాళ్ళను పరిశీలనలో ఉంచటం. మూడోది, ఎక్కువమంది ఒకచోట చేరే అన్ని కార్యక్రమాలను రద్దుచేయటం, స్కూళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్లు బంద్ చేయటం. అంటే ఇది ఇప్పటికే సోకినవాళ్ళనుంచి మిగతా వాళ్లకు అంటకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. ఇక మన ముచ్చట్లలోకి వెళ్దామా.

    ఈ ఆదివారం చాలావరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారనుకుంటా. ఇదీ ఒకందుకు మంచిదే. ఈ మధ్య ఆదివారాలు, సెలవు రోజులొస్తే ఎవరూ విశ్రాంతి తీసుకోవడంలేదు అందరూ రోడ్లమీదే వుంటున్నారు. కరోనా వైరస్ కొన్ని మంచి పనులు కూడా చేస్తుందన్నమాట. అందర్నీ సెలవురోజున ఇంటిపట్టున ఉంచింది. దానితో మనకు విశ్రాంతితో పాటు మన జీవిత భాగస్వామి, పిల్లలు సంతోషంగా వుంటారు. అయితే ప్రభుత్వం ఓ పనిచేయాలి. అందరూ ఇంటిపట్టున ఉంటే ఆడుకోవటానికి కేరమ్ బోర్డులు, చెస్ బోర్డులు లాంటివి సప్లై చేస్తే బాగుణ్ణు. లేకపోతే అందరూ టీవీ కే అతుక్కుపోతారు. దీనివలన ఇంకో మంచికూడా జరిగిందండోయ్. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం తగ్గాయంట. ఇప్పటికే పూర్తిగా దిగ్బంధనం చేసిన చైనా, ఇటలీ నగరాల్లో ఈ ఫలితాలు అద్భుతంగా వున్నాయంట. అలాగే ట్రాఫిక్ ఝాముల జంఝాటం లేదంట. కాబట్టి కరోనా వైరస్ పర్యావరణానికి పరోక్షంగా మేలుచేసిందన్నమాట. పోనీలే మన పాలకులు ఎటూ చర్యలు తీసుకోవడంలేదు, కరోనా అన్నా ప్రకృతికి మేలు చేసింది. అలాగే ఎక్కువ కంపెనీలు ఇంటిదగ్గర్నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ఇది కూడా పర్యావరణానికి ఎంతో మేలుచేస్తుంది. కాకపోతే చిక్కల్లా ఇంటిదగ్గర వాళ్ళను టీలని, కాఫీలని విసిగిస్తున్నారంట. ఆఫీసు లో ఉన్నట్లు ఇంట్లోనూ ఆ వాతావరణం ఉండాలంటే ఎలాకుదురుతుంది చెప్మా. అంతవరకైతే పర్వాలేదు. కొంతమంది సతీమణినో, పిల్లలనో వర్క్ షేర్ చేసుకోమని అడుగుతున్నారంట. ఇంకొంతమంది ఇంటిదగ్గర్నుంచి పనిచేసినా టంచనుగా 10 గంటలకు టిప్ టాప్ గా రెడీ అయి కంప్ట్యూటర్ ముందు కూర్చుంటున్నారంట. అలా అయితేనే వాళ్లకు పనిచేయటానికి మూడ్ వస్తుందంట. కరోనాతో మారిన పని అలవాట్లతో ఎన్నో విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయన్నమాట.

    ఇక అమెరికా అధ్యక్షుడిమీద ఎన్నో జోకులు పేలుతున్నాయి. మొదట్లో ట్రంప్ తన సహజ రీతిలో అందర్నీ తిట్టిపోశాడు. అనవసరంగా భయాందోళనలు మీడియా రెచ్చగొడుతుందని ట్వీట్లు చేసాడు. మొదటగా నమోదయిన వాషింగ్టన్, ముఖ్యంగా సియాటిల్ చుట్టుపక్కల ప్రజలు ట్రంప్ నిర్వాకం వలన రెండు వారాలు ఆలస్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం వలన జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిందని వాపోతున్నారు. చివరకి తనదాకా వస్తేగానీ అర్ధంకాలేదు. విశేషమేమంటే ఇప్పటికీ టెస్ట్ లాబులు సరిపడా లేకపోవటం వలన అనుమానితుల్ని వెంటనే పరీక్ష చేయలేకపోతున్నారు. అమెరికా లాంటి అధునాతన సాంకేతికత కల్గిన దేశం కేవలం పాలకుల తప్పిదాలకు బలైపోతున్నారంటే ఆశ్చర్యంగా వుందికదూ. కానీ ఇదిమాత్రం నిజం. అంతేకాదు కరోనా వైరస్ సోకినా వాళ్ళు ట్రంప్ కి దగ్గరగా రావటం అందరికీ ఆందోళనగా ఉంటే నేను పరీక్ష చేయించుకోనని మారాం చేయటం ఇంకో ప్రహసనం. చివరకి ఎట్టకేలకు పరీక్ష చేయించుకున్నాడు. అమెరికా అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడే అందినవార్త పరీక్ష నెగటివ్ అని వచ్చిందంట. ట్రంప్ సంగతి వదిలిపెడదాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం మాట్లాడాడు? అసలది పెద్ద సమస్యేకాదు. లేని పోని ప్రచారం చేస్తున్నరు , పారాసెటమాల్ ఒక గోలి వేసుకుంటే తగ్గిపోతుందని ఒక సైన్టిస్టు చెప్పిండు, పనికిమాలిన ప్రచారాలు చేయొద్దు. నిజంగా అది మన గడప దగ్గరికి వస్తే మా ఎమ్మెల్యేలందరూ వురుకుతారు , మాస్కులు లేకుండా పనిచేస్తారు. ఎన్నికోట్లయినా ఖర్చుపెడతాం. అదేందో ఆయన చెప్పిన మరసటి రోజే కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ లో చనిపోయాడు. దేశం మొత్తం మీద కరోనా వైరస్ తో చనిపోయిన మొదటి కేసు హైదరాబాద్ లోనే నమోదయ్యింది. అయినా వురికి ఆపలే. అదేమంటే పొరుగు రాష్ట్రం వాడుకదా మనవాడు కాదు కదా అని సమర్ధించుకుంటారేమో. మరి అదే నోటితో నిన్న జనం భయపడకుండా ఉండటానికి అలా అన్నానని చెప్పాడు. అన్ని స్కూళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్లు మూయించేయటంతో భయాందోళనలు నిజమో కాదో ఎరకయ్యింది . రామాయణం లో పిడకల వేట లాగ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ పెద్ద ప్రకటనే ఇచ్చాడు. అసలీ చైనా వాళ్ళు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు తినటమేంటి? ఇటువంటి అలవాట్లతో అందర్నీ ఇబ్బంది పెట్టటమేంటి? అయ్యా , షోయబ్ అక్తర్ మీ దేశం లో చైనా వాళ్ళను ఇంకొక్కమాట అంటే మీ ప్రభుత్వం ముందు మిమ్మల్ని బొక్కలో తోస్తుంది సాబ్, జర జాగ్రత్త. చూసారా ఎన్ని వింతలూ, విశేషాలో ? ఒకవైపు ఈ మహమ్మారి ఏ ఉపద్రవం తీసుకొస్తుందోనని అందరూ టెన్షన్ టెన్షన్ లో ఉంటే నాయకులు మాత్రం వాళ్ళ పద్ధతుల్లో జనాన్ని ఆనందపరుస్తున్నారు. పోనీలే ఎటూ వేరే వినోదం లేదు కదా , వీళ్ళ మూలానన్నా సరదాగా నవ్వుకుంటున్నారు.

    ఇంత టెన్షన్ లో కూడా కొన్ని మంచి వార్తలు వింటున్నాం. నిన్న వచ్చిన వార్తప్రకారం చిన్న పిల్లల పై ఇది దయ చూపిస్తుందని తెలిసింది. ఇప్పటివరకూ చిన్నపిల్లలెవరూ దీనివలన చనిపోయినట్లు నిర్ధారణ కాకపోవటం ఊరట కల్గించే అంశం. పిల్లలవలన ఇతరులకు సోకేదికూడా తక్కువేనని తెలిసింది. ఈ వార్త నిజంగా ఎంతో మంది తల్లులకు పెద్ద రిలీఫ్ నిచ్చింది. అలాగే ఇంకో విషయంకూడా బయటపడింది. మనకు జలుబు రాగానే భయపడాల్సిన పని లేదు. ముక్కు చీదటం అసలు ఈ వైరస్ లక్షణమే కాదట. అలాగే ఒకటే కారటం( Running Nose ) కూడా అరుదుగా వస్తుందంట. ఈ రెండు లక్షణాలు ఎక్కువగా సాధారణ జలుబు వలనో, ఎలర్జీ వలనో వస్తాయి. కాబట్టి జలుబు, ముక్కు చీదటం రాగానే భయపడిపోయి ఆసుపత్రికి పరుగెత్తొద్దు. జ్వరం, పొడి దగ్గు, ఆయాసం ( గాలి పీల్చుకోలేకపోవటం) ఈ వైరస్ లో ఎక్కువగా వుండే లక్షణాలు. తలనొప్పి, గొంతు నొప్పి, అలసట కూడా కొన్ని సందర్భాల్లో వుండే అవకాశం వుంది. కాకపోతే వయోవృద్దులు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. చనిపోయిన వాళ్లలో ఎక్కువమంది వాళ్ళే. ముఖ్యంగా గుండె జబ్బులు, బిపి , షుగర్ వ్యాధులు వున్న వయో వృద్దులు ఇంటికే పరిమితమైతే మంచిది. ఇంకో మంచి వార్త విన్నాం. అమెరికా లో చదువుతున్న మన విద్యార్థులకు తానా ఆధ్వర్యాన ప్రవాస భారతీయ ఇళ్లల్లో ఆశ్రయం కల్పించారని పత్రికల్లో చూసాను. ఈ స్పూర్తితో అన్ని అమెరికా ప్రవాస భారతీయ సంఘాలు కృషిచేసి ఈ పరిస్థితుల వలన ఇబ్బందులు పడుతున్న మన విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తారని ఆశిద్దాం.

    ఇక ఆంధ్ర లో ఈ వైరస్ పుణ్యమా అని స్థానిక ఎన్నికలు వాయిదా వేయటం మంచి పరిణామం. ఎన్నికలకోసం ఎక్కువమంది గుమికూడే వాతావరణం మంచిది కాదు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హర్షిద్దాం. ఇదీ ఒకందుకు మంచిదే. ఆంధ్రాలో ఇప్పుడున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక బ్రేక్ పడటం సామాన్య ప్రజలకు మంచిదే. అలాగే ప్రార్ధనా మందిరాల్లో ఎక్కువమంది గుమికూడటాన్ని కూడా నిషేధించాలి. మసీదుల్లో శుక్రవారపు ప్రార్ధనలు, ఆదివారాలు చర్చిల్లో ప్రార్ధనలూ, తిరుమలలో రోజువారీ దర్శనాలు కొన్నాళ్ళు రద్దుచేయటం మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన కూడా ఈ పరిస్థితుల్లో మంచిది కాదు. గంటకు నాలుగువేలమంది అంటే చాలా ఎక్కువ. దయచేసి 200 పైన వుండే ఎటువంటి కార్యక్రమాలు రద్దు చేయటం మంచిది. ఎందుకంటే మనదేశంలో పరిస్థితి ని రెండో దశ నుంచి మూడో దశకు వెళ్లనియ్యకుండా చూడాలంటే అన్ని మార్గాలు మూసివేయటమొక్కటే మార్గం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనముండదు. ఒకసారి మూడో దశలోకి వెళ్ళామంటే నాలుగో దశలోకి వెళ్లి మన చేతులు దాటి పోవటం ఖాయం. మనదేశం లో ఆ దశలో కంట్రోల్ చేయటం సాధ్యమయ్యే పనికాదు. ముందుగానే కఠినమైనా కొన్ని గట్టి షరతులు విధించుకుందాం. మనం ఈ మహమ్మారిని రెండో దశలోనే ఆపగలిగితే మానవాళికి మేలు చేసిన వాళ్లమవుతాం. ఆ దిశగా అందరం ముందుకెళ్దాం.

    కొసమెరుపు : పోయినవారం మనం ముచ్చట్లలో రైళ్లలో ఉలెన్ దుప్పట్లు తీసేయాలని మాట్లాడుకున్నాం గుర్తుందా . మన సణుగుడు రైల్వే వాళ్లకు వినబడినట్లుంది రెండు రోజుల క్రితం ఉలెన్ దుప్పట్లు సరఫరా చేయమని ప్రకటించారు. హమ్మయ్య రైళ్లలో ఇప్పుడు కొంత వరకు శుభ్రంగా ప్రయాణం చేయొచ్చు. కావాలంటే మీరే మందపాటి దుప్పట్లు తీసికెళ్ళండి. అయినా అవసరముండదు లెండి, ఎసి 23, 24 డిగ్రీలకు పైనే ఉండేటట్లు సరిచేస్తారంట. ఏమైనా ఉలెన్ దుప్పట్లు, కర్టెన్లు తీసేయటానికి దోహదపడిన కరోనా కి ధన్యవాదాలు! అవును మరి చెడుని తెగనాడుదాం , మంచి ని పొగుడుదాం . ఈ పేరుతోనైనా రైల్వే వాళ్ళు మన మొర ఆలకించినందుకు ధన్యవాదాలు.

    ఇవీ ఈవారం ముచ్చట్లు, వచ్చేవారం మళ్లీ కలుద్దాం. మధ్యలో సెటైర్లు ఎవర్నీ కించపరచటానికి కాదు సుమా కేవలం టెన్షన్ నుంచి జనానికి విరామం కోసమే , అన్యధా భావించవద్దు.

    ……. మీ రామ్