
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీ మంత్రులు అవాక్కవుతున్నారు. సంక్షేమ పథకాల దగ్గరి నుంచి, ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని వెలికితీసే చర్యల వరకు జగన్ తనదైన శైలిలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికారం కట్టబెట్టిన ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న ఆయన.. తాజాగా మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సంక్షేమ పథకాల అమలులో భాగంగా, ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కరానికి మంత్రులు తమ పేషీల్లో అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు.ప్రజలు, అర్జీదారులు తమ అభ్యర్థనలు చెప్పుకొనేందుకు సెక్రటేరియట్ కు వచ్చే అవకాశం ఉన్నందున.. వారి సమస్యలు పరిష్కరించే దిశగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు, తదితర కారణాల రీత్యా బుధవారం ఒక్క రోజు మాత్రం కచ్చితంగా సెక్రటేరియట్‌లో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.