
పగవారి మదిలో కూడా జగన్ మంచోడన్న ముద్ర పడింది. జగన్ సర్కార్ డాక్టర్ సుధాకర్ ను వేధించినా కూడా ఆయన తల్లి జగన్ ను మంచోడని.. వైసీపీ ఎమ్మెల్యేలే చెడ్డోళ్లు అని అనడం వైరల్ గా మారింది. ఇది స్వయంగా టీడీపీ నేత నారా లోకేష్ ఎదుటే అనడం విశేషంగా మారింది. ‘‘ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి నాయకుడు.కానీ నర్సిపట్నం, పెందూర్తికి చెందిన ఆయన పార్టీ ఎమ్మెల్యేలు చాలా చెడ్డవారు. గత వారం గుండెపోటు కారణంగా చనిపోయిన దళిత వైద్యుడు కె సుధాకర్ మరణానికి వారు కారణమయ్యారు.’’ అని ఆయన తల్లి ఆరోపించారు. సుధాకర్ నివాసానికి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో సుధాకర్ తల్లి లక్ష్మి బాయి చేసిన వ్యాఖ్య ఇది.
జగన్ మంచి వ్యక్తి అని, అయితే ఆయన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు – నర్సిపట్నం ఎమ్మెల్యే గణేష్, పెందూర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు తన కుమారుడి అకాల మరణానికి కారణమని ఆమె ఆరోపించారు. నర్సిపట్నం ఎమ్మెల్యేను భూ కబ్జాదారుగా ఆమె అభివర్ణించారు. “నా కొడుకు మరణానికి కారణమైన వారు శిక్షించబడే వరకు.. నా కుటుంబానికి న్యాయం జరిగే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. అప్పటి వరకు నేను చనిపోను, ”అని ఆమె శపథం చేయడం విశేషం. అధికార పార్టీకి లేదా ప్రభుత్వానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా తన కుటుంబాన్ని పిలిచి ఆమెను ఓదార్చలేదని లక్ష్మి బాయి అన్నారు. “లోకేష్ నా కుటుంబానికి సంతాపం తెలిపినందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని ఆమె చెప్పారు.
అంతకుముందు, లోకేష్ మాట్లాడారు. మరణించిన వైద్యుడి తల్లికి టిడిపి నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాడు, వారికి న్యాయం జరిగే వరకు .. దోషులకు శిక్ష పడే వరకు వారి ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
కొడుకు మరణించిన నేపథ్యంలో ధైర్యం చేసినందుకు డాక్టర్ తల్లిని లోకేశ్ ప్రశంసించారు. సుధాకర్ ది సహజ మరణం కాదని చెప్పాడు. ఫేస్ మాస్క్.. పిపిఇ కిట్లను అడిగినందుకు, దళిత వైద్యుడిని వేటాడి, టార్గెట్ చేసి, కొట్టారన్నారు. వేధించారు. సస్పెండ్ చేశారు.. పోర్ట్ సిటీ రోడ్లపై పరేడ్ చేశారు. “జగన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరాయంగా వేధింపులకు గురిచేసింది” అని ఆయన ఆరోపించారు.