Pension Removal: ఏరుదాటాక ఏపీ సీఎం జగన్ తెప్ప తగిలేస్తు్నారు. ఆర్భాటంగా ప్రవేశపెట్టడం.. అనంతరం అవసరం తీరాక కాలదన్నడం అలవాటుగా మార్చుకున్నారు. అందుకే ఏపీ సంక్షేమ రాజ్యంలో ‘సంక్షేమ’ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు కొన్ని పథకాలకు సీఎం జగన్ బటన్ నొక్కడం మరిచిపోతున్నారు. సంక్షేమంలో దేశానికే జగన్ దిశ చూపారని అధికార వైసీపీ నేతలు ఆర్భాటంగా చెబుతున్నారు. వేల, లక్షల కోట్లు ప్రజలకు పంచి.. వారి జీవితాలనే మార్చేస్తున్నామని గణాంకాలతో ప్రకటిస్తున్నారు. రానురాను సంక్షేమ బాధితులు పెరుగుతున్నారు. అన్ని పథకాల్లోనూ కోతలు ప్రారంభమయ్యాయి. కొత్త పథకాల అమలుకు పాత వాటికి కోతలు విధించాల్సిన తప్పని పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు పింఛన్లపై పడడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మీకెందుకు పింఛన్. మీరు పింఛన్ కు అనర్హులు. మీ పేరిట అధికంగా భూములు ఉన్నాయి. అధికంగా విద్యుత్ వినియోగిస్తున్నారు. నాలుగు చక్రాల వాహనం ఉంది. దీనిపై 15 రోజుల్లో సమాధానం ఇవ్వండి అంటూ నోటీసులిస్తున్నారు.

ఒక్కో మునిసిపాల్టీలో 6 నుంచి 10 వేల వరకూ పింఛన్ల తొలగింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా నోటీసులందిస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వారి నుంచి వినతులు, నోటీసులకు సమాధానాల గురించి ప్రత్యేక కౌంటర్లే తెరుస్తున్నారు. ఇప్పుడున్న పింఛన్ లబ్ధిదారుల్లో 10 శాతం పెన్షన్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.250లు పెంచనుంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. దీంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేసింది. పింఛన్లలో కోతకు నిర్ణయించింది. అంటే ఆ పది శాతం మంది ప్రభుత్వ బాధితులుగా మారనున్నారన్న మాట. అంతకంటే వ్యతిరేకులుగా మారతారనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. పోనీ పెంచిన రూ.250 మొత్తం దక్కించుకున్న లబ్ధిదారులు ప్రభుత్వంపై విశ్వసనీయతగా ఉంటారా? అంటే అదీ గ్యారంటీ లేదు. పన్నుల రూపంలో కట్టినతోనే కదా పింఛన్లు అందిస్తున్నారు. అందులో ఏం గొప్ప అన్నవారే అధికులు.
అయితే సంక్షేమం విషయంలో జగన్ తనను తాను మోసం చేసుకుంటున్నారు. అసలుకే సమస్యలు ఏరికోరి తెచ్చుకుంటున్నారు. ముందు సంవత్సరం పథకాలను బటన్ నొక్కి ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది పథకాలని నమ్మబలుకుతున్నారు. ప్రతీ పథకంలోనూ కోతలు కొనసాగుతున్నాయి. కొన్ని పథకాలు నిలిచిపోతున్నాయి. అసలు కొన్నింటికి బటన్ నొక్కడమే మరిచిపోతున్నారు. జాప్యం చేస్తున్నారు. రేషన్ కార్డులను తొలగిస్తున్నారు. పింఛన్లను అడ్డగోలుగా కోసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఇంతవరకూ విడుదల చేయలేదు. ఇలా సంక్షేమం విషయంలో జగన్ సర్కారు అడ్డగోలు మోసానికి తెరతీసింది.

సంక్షేమం మాటున దుబారా చేసి రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చింది జగన్ సర్కారు. ప్రజలకు ఉచితల పేరిట డబ్బును పప్పూ బెల్లంలా పంచేస్తున్నారు. ఆదాయం సమకూరక.. అప్పుపుట్టక జగన్ సర్కారు చేతులెత్తేస్తోంది. సంక్షేమానికి కోత విధిస్తోంది. కానీ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నట్టు చెబుతోంది. ఇప్పుడు అదే సంక్షేమాన్ని ఫార్సుగా మార్చుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికైతే ఏ సంక్షేమంతో మరోసారిఅధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ కు అదే సంక్షేమ బాధితులు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.