Homeజాతీయ వార్తలుShiv Sena Focus On Telangana: శివసేన రీఎంట్రీ.. తెలంగాణపై ఫోకస్‌.. బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకేనా?

Shiv Sena Focus On Telangana: శివసేన రీఎంట్రీ.. తెలంగాణపై ఫోకస్‌.. బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకేనా?

Shiv Sena Focus On Telangana: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. మహారాష్ట్రకు చెందిన లీడర్లను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే మూడు సభలు కూడా నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంపై చేయనంత ఫోకస్‌.. మహారాష్ట్రపై పెట్టారు కేసీఆర్‌. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని సీఎం ఏక్‌నాథ్‌ షిండే కూడా తెలంగాణపై ఫోకస్‌ పెట్టారు. శివసేన పార్టీని తెలంగాణలో పునరుద్ధరించాలని భావిస్తున్నారు. త్వరలో జరిగే ఎన్నికల నాటికి బలోపేతం చేసి బీఆర్‌ఎస్‌ ఓట్లు చీల్చాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకే..
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసే దిశగా కేసీఆర్‌ ప్రయత్నం చేస్తుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే కూడా తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెక్‌పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మీరు ఇక్కడికి వస్తే.. మేము అక్కడికి వస్తాం అన్నట్లుగా.. ఆ పార్టీ తెలంగాణలో యాక్టివ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో శివసేన ఎంట్రీ మొదలైంది. ఇన్నాళ్లూ సైలెంటుగా ఉన్న ఆ పార్టీ.. ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా… తెలంగాణలో శివసేన రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకారి శివాజీకి బాధ్యతలు అప్పగించింది.

అవకాశం ఇచ్చింది కేసీఆరే..
శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే… తెలంగాణపై ఫోకస్‌ పెట్టకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇందుకు పరోక్షంగా కేసీఆరే కారణంగా చెప్పొచ్చు. తెలంగాణతో సరిహద్దులు కలిగివున్న నాందేడ్, ఔరంగాబాద్‌ సహా… మొత్తం 51 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ని విస్తరించేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ఇదే ఏక్‌నాథ్‌ షిండేకు తలనొప్పిగా మారింది. అసలే ప్రస్తుతం ఆయన పరిస్థితి బాలేదు. సీఎం సీటులో ఎన్నాళ్లు ఉండారో అర్థం కాని స్థితి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన బీజేపీ కన్నెర్ర జేస్తే ఏక్‌నాథ్‌ షిండే పదవి పోవడం ఖాయం. అలాంటి ఆయన ముందు తన సంగతి చూసుకోవాల్సిన సమయంలో.. తెలంగాణపై ఆయన ఫోకస్‌ పెట్టడం చర్చనీయాంశమైంది.

బలమైన నేతకు అధ్యక్ష బాధ్యతలు..
తెలంగాణలో సుంకారి శివాజీకి మంచి పేరుంది. ప్రధానంగా.. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ… సమస్య ఎక్కడ ఉంటే.. అక్కడ ఆయన వాలిపోతారనే గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఏక్‌నాథ్‌.. ఏరికోరి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు శుక్రవారం కట్టబెట్టారని అంటున్నారు. ఇప్పుడు శివాజీకి బాధ్యత పెరిగింది. ఆయన మరింత దూసుకుపోతారనడంలో సందేహం అక్కర్లేదు. ఐతే.. తెలంగాణలో శివసేనకు ఏమాత్రం గుర్తింపు లేదు. దానికితోడు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ .. నువ్వా నేనా అని తలపడుతున్నాయి. మధ్యలో బీఎస్పీ, షర్మిల పార్టీ కూడా హడావుడి చేస్తోంది. ఇక వామపక్షాలు ఎప్పుడూ ఉండేవే. ఇన్ని పార్టీలు ఉండగా.. ఇప్పుడు శివసేన ఎలా బలోపేతం అవుతుంది అన్న ప్రశ్న వస్తోంది.

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ప్రభావం చూపిస్తోంది కాబట్టే… శివసేన ఉలిక్కి పడుతోందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే ఏం చేసుకున్నా.. బీఆర్‌ఎస్‌ జోరుకు బ్రేక్‌ వేయలేరని పేర్కొంటున్నారు. మరి తెలంగాణలో శివసేన జోరు ఎలా కొనసాగిస్తుంది అనేది చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular