Sharmila Jagan: వైఎస్ షర్మిల.. ఈమె వైఎస్ఆర్ కుమార్తెనే అయినా.. వైఎస్ జగన్ కు చెల్లెలే అయినా కూడా రాజకీయంలో మాత్రం భవబంధాలను కాలదన్నుకుంటోంది. తగ్గేదేలే అంటూ తెలంగాణలో రాజకీయం చేస్తోంది. తాజాగా భద్రాచలం వరద విషయంలో తన అన్న అని కూడా చూడకుండా కేసీఆర్ తోపాటు జగన్ ను కలిపి తిట్టేసింది.
గతంలో కేసీఆర్ ఇల్లు ప్రగతిభవన్ కు వచ్చిన జగన్ కౌగిలించుకొని స్వీట్లు తిని.. భోజనం చేసి కలియ తిరిగిన విషయాన్ని తవ్వితీసిన షర్మిల సెటైర్లు వేసింది. తెలంగాణలోని భద్రాచలంలో వరదలు వస్తే కేసీఆర్ బాధితులను పరామర్శించలేదని.. దొరలా వచ్చివెళ్లాడని.. చిత్తశుద్ది ఉంటే దోస్త్ అయిన పక్కరాష్ట్రం ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడడం లేదని కేసీఆర్ ను నిలదీసింది షర్మిల..
పనిలో పనిగా తన అన్నయ్య జగన్ పై కూడా సెటైర్లు వేసింది. రాజకీయాల కోసం కేసీఆర్ తో కలిసే జగన్.. వరదలు, ప్రకృతి విపత్తుల విషయంలో ఎందుకు స్పందించరని.. మీ రాజకీయం కోసం తెలంగాణ ప్రజలను బలి చేస్తారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఇప్పుడు వరద రాజకీయం నడుస్తోంది. భద్రాచలం వరదలకు బురదలో కూరుకుపోవడంతో దాన్ని రాజకీయం చేసేస్తున్నారు. షర్మిల పాదయాత్రలో మాట్లాడుతూ సొంత అన్న జగన్ ను కూడా వదిలిపెట్టలేదు. జగన్ ఏపీ రాజకీయాల కోసం పాటుపడితే.. తాను తెలంగాణ రాజకీయాల కోసం ముందుంటానని చెప్పకనే చెప్పారు. రాజకీయ మార్గాల్లో అన్న అన్ననే.. పేకాట పేకాటనే అన్నట్టుగా షర్మిల వ్యవహరించారు.
ఇటీవలే వైఎస్ఆర్ వర్ధంతి, జయంతుల సందర్భంగా కలుసుకున్న షర్మిల, జగన్ ఎడమొహం.. పెడమొహంగానే కనిపించారు. ఆ వైరం పోలేదని తాజాగా మరోసారి షర్మిల వ్యాఖ్యలతో నిరూపితమైంది.