‘జగనన్న వదిలిన బాణాన్ని..’’ వైఎస్ షర్మిల గతంలో చేసిన ఈ వ్యాఖ్య ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే షర్మిల, ‘‘ఎవరూ వదిలిన బాణాన్ని కాదు. రాజన్న బిడ్డను’ అంటూ సరికొత్త వ్యాఖ్య చేశారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణతో ‘ఓపెన్ హార్ట విత్ ఆర్కే’ ఆమె చేసిన ఈ వ్యాఖ్య మళ్లీ పాపులర్ అయింది. షర్మిలతో రాధాక్రిష్ణ చేసిన ఇంటర్వ్యూకు సంబంధించి టీజర్ ను ఆ చానల్ తాజాగా విడుదల చేసింది. ఆదివారం ఇంటర్వ్యూను ప్రసారం చేయనుంది. అయతే ఇప్పుడు అందరూ ఈ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ టీజర్ లో షర్మిల చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. ‘‘జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం.. అవసరమైనప్పడల్లా, అడిగిందల్లా శక్తకి మించి చేశా’’ అంటూ ఒక సందర్భంలో, ‘‘ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు’’ అని మరో సందర్భంలో షర్మిల కామెంట్ చేశారు.
అంతేకాదు.. తన అన్న జగన్ తో రాజకీయంగా తనకు ఎక్కడ చెడిందన్న అంశంపై కూడా కొంత టిప్ ఇచ్చినట్లుగా టీజర్ లో చూపించారు. ‘‘సంబంధం లేదని సజ్జల రామక్రిష్ణారెడ్డన్న అనడం బాధ కలిగించింది’’ అని చేసిన వ్యాఖ్యలు ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
పైగా ‘ఓపెన్ హార్ట విత్ ఆర్కే’ పేరిట ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన రాధాక్రిష్ణ.. వ్యక్తిగత కారణాలతో కొంతకాలం పాటు విరామం తరువాత మళ్లీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి ఇంటర్వ్యూకు వైఎస్ష ర్మిలను ఎంచుకోవడంతో ఈ కార్యక్రమం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అన్నాచెల్లెలి మధ్య విభేదాలకు కారణాలను ఈ ఇంటర్వ్యూలో బయటపెడతారా? అన్న ఆసక్తితో అంతా ఎదురు చూస్తున్నారు.