
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ట్రెండ్ ను బట్టి మారుతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తోందో అప్పటి పరిస్థితులే నిర్ణయిస్తాయి. పూర్వ కాలం రోజుల్లో మాదిరిగా ఏవో రెండు పార్టీలు మాత్రమే అధికారంలో ఉంటాయన్న సాంప్రదాయం కనుమరుగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్లు బలమైన పార్టీలు ఉండగా ఇప్పుడు ఆ పార్టీలో కార్యకర్తగా ఉండడానికి చాలా మంది ఇంట్రెస్టు పెట్టడం లేదు. కొత్త పార్టీలు పుట్టుకొచ్చి సాంప్రదాయ పార్టీలను వెనక్కి నెట్టేశాయి. తాజాగా తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించి కొత్త చర్చను లేవదీశారు. అయితే షర్మిల పవన్ కల్యాణ్ బాటలోనే పొలిటికల్ వే లో వెళ్తున్నట్లు చర్చ సాగుతోంది.
2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ముందుగా టీడీపీ, బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఆ సమయంలో సక్సెస్ కావడంతో నేరుగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2019లో జనసేన పార్టీ పెట్టి రంగంలోకి దిగారు. రెండు చోట్ల పోటీచేశారు. అయితే అనుకున్నట్లు పరిస్థితులు లేవు. పవన్ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనే ఓడిపోవడం చర్చనీయాంశమైంది. దీంతో పవన్ వచ్చేసారి ఎలాగైనా పార్టీ పటిష్టత తీసుకురావాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇప్పుడు షర్మిల కూడా పవన్ మాదిరిగానే గత ఎన్నికల్లో అన్న జగన్ కోసం పనిచేశారు. తెలంగాణ, ఆంధ్రలో తీరికలేకుండా ప్రచారం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. దీంతో షర్మిల తాను కూడా రాజకీయాల్లో నిలదొక్కకోవచ్చు అనే నమ్మకంతో ఉన్నారు. దీంతో తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకొని ఈనెల 8న పార్టీని ప్రకటించారు. అయితే తెలంగాణలో త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. దీంతో అక్కడ పోటీ చేస్తారా..? అని కొందరు ప్రశ్నించారు.
కానీ షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అసలు హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అవసరమా..? అని కొత్త చర్చకు తెరలేపారు. దీంతో షర్మిల ఉప ఎన్నికల జోలికి పోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే సంసిద్ధతతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయానికి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా..? లేక ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.? అన్నది తేలాల్సి ఉంది.