G20 Summit 2022 Modi- Joe Biden: మోడీని ప్రేమించే వాళ్ళు ఉంటారు.. ద్వేషించే వాళ్ళూ ఉంటారు. కానీ ఆయన ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేరు. ఇండోనేషియా వేదికగా బాలీ లో జరిగిన జి20 సదస్సులో కూడా ప్రపంచాధినేతలు ఇదే సూత్రాన్ని అనుసరించారు. ఏకంగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జీ20 దేశాలకు నాయకత్వం వహించాలని మోదిని కోరారు. డిసెంబర్ ఒకటి నుంచి భారత్ అధికారికంగా జీ20 దేశాలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుంది. వాస్తవానికి ఈ సమస్యకు ముందు మోడీ దౌత్యపరంగా చేయాల్సింది మొత్తం చేశారు. కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం స్తబ్దుగా ఉన్నప్పటికీ ఒక భారత్ మాత్రమే గణనీయమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేసింది. దీంతో మోడీ నాయకత్వంపై ప్రపంచ దేశాల నాయకులకు నమ్మకం ఏర్పడింది.. దీనికి తోడు ఉక్రెయిన్_ రష్యా యుద్ధం సమయంలో ఇరు దేశాల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. యుద్ధం విరమించాలని కోరారు.. నాడు మోడీ చెప్పిన మాటలే ప్రస్తుతం ఆ ఇరుదేశాల అధినేతలకు శిరోధార్యం అవుతున్నాయి.

కాశ్మీర్ సమస్యను లేవనెత్తే అవకాశం
జి20 సదస్సును మొదట ఢిల్లీలో నిర్వహించాలి అనుకున్నారు.. కానీ ఈసారి బాలి తర్వాత కశ్మీర్లో జరపాలని మోదీ అనుకుంటున్నారు. ఆ దిశగా కార్యాచరణ కూడా మొదలైంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే కాశ్మీర్లో ఏర్పాట్లను ఒక కొలిక్కి తీసుకొచ్చారు.. కాశ్మీర్ సమస్యను పాకిస్తాన్ ఎలా రావణకాష్టం లాగా రగుల్చుతుందో, దీనికి చైనా వంటి దేశం ఎలా వంత పాడుతుందో చెప్పే ఉద్దేశంతోనే కాశ్మీర్లో జీ20 మలి సదస్సు ద్వారా వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని చైనా తప్పుపడుతోంది. పాకిస్తాన్ ఇంకా స్పందించలేదు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలతో భేటీ
జి20 గ్రూపు ప్రధాన కార్యాచరణ బుధవారం మధ్యాహ్నమే ముగిసింది. కానీ భారత్, అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల నేతలు ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. బాలిలోని మడ అడవులను వీరంతా సందర్శించారు.. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తదితరులు తమన్ హుటన్ రయ న్గు రాహ్ రాయ్ మడ లో మొక్కలు నాటారు. భారత ప్రాచీన, సుసంపన్న సంప్రదాయ కళాకృతులను వివిధ దేశాలకు బహుకరించడం ప్రధాన మంత్రి మోడీకి అలవాటు. ఈసారి జీ20 సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల అధినేతలకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన బహుమతులను అందజేశారు..కాంగ్రా సూక్ష్మ పెయింటింగ్స్ ను బైడెన్ కు అందజేశారు. గుజరాత్ చేనేత చీర మాతా నీ పచేడీ ని రిషి సునాక్ కు, చోటా ఉదయపూర్ లోని రాథ్వా కళాకారుల గిరిజనుల జానపద కళ పితోరా ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కు, పటాన్ పటోలా దుపట్టాను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి, సంప్రదాయ అగేట్ పాత్రలను ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్ అధినేతలకు అందించారు.

బ్రిటన్ బంపర్ ఆఫర్
బాలి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి తో మోదీ జరిపిన సమావేశం అనంతరం.. ఆయన భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. భారత యువ నిపుణులకు ఏటా మూడు వేల వీసాలు అందించే కొత్త పథకానికి రిషి ఆమోదం తెలిపారు. మోడీ మాట్లాడిన కొద్ది రిషి ఈ నిర్ణయం ప్రకటించారు. మంచి పని దీని ప్రకారం బ్రిటన్ పౌరులు సైతం భారత్ లో నివసించేందుకు, పని చేసేందుకు కూడా వీలు కల్పించే ఈ పథకాన్ని 2023 సంవత్సరం మొదట్లో అధికారికంగా ప్రారంభిస్తారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న డిగ్రీ పట్ట భద్రులైన భారతీయ పౌరులు బ్రిటన్ కు వచ్చి రెండు సంవత్సరాల వరకు చదువుకోవడంతోపాటు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఏటా మూడు వేల వీసాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. వాణిజ్యం, రక్షణ, భద్రత, రవాణా రంగాల్లో పరస్పర సహకారం పై రిషి సునాక్ తో మోడీ చర్చించారు. ప్రాన్స్, సింగపూర్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ అధినేతలతో వివిధ అంశాలపై చర్చించారు.