AP Minister Appalaraju: ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మావోయిస్టుల లేఖ కలకలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన అప్పలరాజు మంత్రి పదవి కూడా అంతే వేగంగా వరించింది. రెండోసారి విస్తరణలో సీఎం ప్రధాన అనుచరులు మంత్రి పదవి పోగొట్టుకున్నా అప్పలరాజుకు మాత్రం కొనసాగింపు లభించింది. జిల్లాలో అధికార పార్టీకి సీనియర్లు ఉన్నా అందరి కంటే దూకుడుగా వ్యవహరిస్తారన్న టాక్ అప్పలరాజుపై ఉంది. అదే ఆయనకు గుర్తింపు తెచ్చింది. ఇప్పుడదే ప్రతిబంధకంగా మారింది. ఏకంగా మావోయిస్టులకు టార్గెట్ చేసేంతటి స్థాయికి చేరింది. అసలు సీఎం స్థాయి వ్యక్తికి కూడా మావోలు లేఖలు రాయలేదు. కానీ మంత్రి అప్పలరాజును ఎందుకు టార్గెట్ చేసినట్టన్న చర్చ అయితే సిక్కోలు జనాల్లో ప్రారంభమైంది.

మంత్రి అప్పలరాజు ప్రాతనిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గంలో అపార భూ వనరులు ఉన్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అధికం. అదే సమయంలో ప్రభుత్వ భూములను దశాబ్దాలుగా నిరుపేద రైతులు సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఆ భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. గత కొన్నేళ్లుగా సామ, వేద, దండోపాయ రూపాల్లో స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. మరికొన్నింటికి వివాదం సృష్టించి.. తామే పరిష్కరిస్తున్నామన్న బిల్డప్ ఇచ్చి షటిల్ చేసుకుంటున్నారు. వివాదాస్పద భూముల విషయంలో ఎంటరవుతున్నారు. హస్తగతం చేసుకుంటున్నారు. వీటన్నింటికీ మంత్రి అనుచరులే ప్రధాన సూత్రధారులు. ఇటీవల వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఈ విషయం మావోయిస్టుల దృష్టికి వెళ్లింది. నేరుగా మంత్రినే హెచ్చరిస్తూ.. పద్దతి మార్చుకోవాలంటూ ఏవోబీ సరిహద్దు మావోయిస్టు దళం పేరిట ఒక లేఖ మంత్రి నివాసానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రితో పాటు మరోవైసీపీ కీలక నాయకుడికి వచ్చిన లేఖపై ఏపీ ఇంటెల్లిజెన్స్ బ్యూరో విభాగం ఇటీవల ఆరా తీసింది.

వాస్తవానికి గత ఎన్నికల్లో మంత్రి అప్పలరాజు ఎమ్మెల్యేగా గెలిచేందుకు మావోయిస్టులు కూడా పరోక్ష సహకారం అందించినట్టు టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే మాజీ మావోయిస్టులు కొంతమంది అప్పలరాజుకు అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రత్యేక టీమే పనిచేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత అప్పలరాజు తీరు మారింది. మంత్రి పదవి చేపట్టేసరికి అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయి. అటు సలహాదారులుగా చేరిన మాజీ మావోయిస్టులు తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు ఒకరిద్దరు చిన్న పత్రికల వారు మంత్రికి అనుకూలంగా కథనాలు రాస్తూ దందాకు మరింత ఆజ్యం పోశారు. ,నియోజకవర్గంలో భూ దందాలు పెరిగిపోవడంతో అటు ప్రజా వ్యతిరేకత సైతం ప్రారంభమైంది. దీంతో అటు మంత్రితో పాటు మాజీ మావోయిస్టులకు సైతం మరోసారి హెచ్చరిస్తూ ఏవోబీ దళం రెండోసారి లేఖ రాసినట్టు సమాచారం. మొత్తానికైతే ఏపీలో ఎక్కడా లేని విధంగా మావోయిస్టులు మంత్రి అప్పలరాజును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.