Amaravathi Case : జగన్ సర్కారుకు మరో భారీ ఊరట. అమరావతి కేసుల్లో అనుకూలమైన తీర్పులు వస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రతికూల తీర్పులతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని కోసం సేకరించిన భూములను పేదల ఇళ్ల పట్టాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమంటూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. దీంతో అమరావతిలో ఇళ్ల స్ధలాల కేటాయింపుకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అమరావతితో సహా కీలక ప్రాజెక్టులపై సమగ్ర దర్యాప్తునకు సిట్ సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు పేదల ఇళ్ల స్థలాలకు అమరావతి భూముల కేటాయింపు సబబేనని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో జగన్ సర్కారుకు ఊరట కలిగింది.
రైతుల అభ్యంతరం..
అమరావతి రాజధాని కోసం చంద్రబాబు సర్కారు 33 వేల ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. కీలక నిర్మాణాలను సైతం ప్రారంభించిన సంగతి విదితమే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దానిపై ఇంకా కోర్టుల చిక్కుముడులు వీడడం లేదు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానికి చెందిన 1100 ఎకరాల్లో ఉమ్మడి కృష్ణ, గుంటూరుకు జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. అయితే రాజధాని కోసం తాము ఇచ్చిన భూముల్ని పేదల పేరుతో పంచి పెట్టడం సరికాదని రైతులు వాదించారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 45ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి అక్కడ ఊరట దక్కలేదు. ప్రతికూల తీర్పు వచ్చింది. ఇది వారికి మింగుడుపడడం లేదు.
పేదలు ఉండకూడదంటే ఎలా?
అయితే ఈ విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రైతులు భావించారు. రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయింపు అనేది నిబంధనలకు విరుద్ధమని వాదించారు. అయితే దీనిపై పలుమార్లు విచారించిన కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. రాజధానిలో పేదలు ఉండకూడదు అంటే ఎలా? అంటూ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. రాజధాని అంటే అన్నివర్గాల సమాహారమని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై పిటీషనర్లు సరైన వాదనలు వినిపించలేకపోయారు. న్యాయమూర్తి లేవదీసిన అంశాలపై సహేతుకమైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో న్యాయమూర్తి కీలక తీర్పును వెలువరించారు. అయితే ఇది జగన్ సర్కారుకు ఊరటనిచ్చినట్టయ్యింది.