Delhi Liquor Scam: మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కాం లో పెద్దగా కదలిక లేదు. మనీష్ సిసోడియా ఎపిసోడ్ తర్వాత ఎందుకో ఈడి అధికారులు చప్పున చల్లారిపోయారు. కానీ ఇందులో మరో లింకు బయటపడింది.. ఈ స్కాంలో డబ్బు హవాలా మార్గంలోనే కాక బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బు తరలించారు. దీనికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వివరాలు వెల్లడించారు.

సూత్రధారి ఆమె
ఇటీవల ఈడీ అధికారులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి ని అరెస్ట్ చేశారు. కానీ ఆయన భార్య, జెట్ సెట్ గో ఏవియేషన్ సంస్థ వ్యవస్థాపకురాలి పాత్ర కూడా ఉందని ఈడీ అధికారులు తేల్చి చెప్పారు. శరత్ చంద్ర రెడ్డి భార్య కనిక టెక్రివాల్ రెడ్డి సంస్థకు చెందిన చార్టెడ్ విమానాల్లోనే హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు నగదు తరలించాలని నిరూపించే ప్రాథమిక ఆధారాలు ఈడీ అధికారులకు లభ్యమయ్యాయి. దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల తరహాలో బేగంపేట విమానాశ్రయంలో కూడా స్క్రీనింగ్ పాయింట్లు లేకపోవడం, వీఐపీల వాహనాలు నేరుగా రన్ వే పై విమానాల దగ్గరికి వెళ్లే వీలు ఉండటం వంటి వెసలుబాట్లను ఇందుకు ఉపయోగించుకున్నట్టు ఈడి అధికారులు చెబుతున్నారు.
ఆ లేఖ ఆధారంగా .
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు ఈ డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గుప్తా గత నెల 17న పూర్తి ఆధారాల కోసం ఒక లేఖ రాశారు. దేశంలో ప్రైవేట్ జెట్ చార్టెడ్ సేవలు అందిస్తున్న జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన డాక్యుమెంట్లు, సమాచారం అత్యవసరంగా కావాలి. కంపెనీ ఏర్పాటు చేసిన తేదీ నుంచి ఇప్పటివరకు ఆ సంస్థ విమానాల ఆపరేషన్లు, వాటి పూర్తి వివరాలు, ఆ ఆ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారు, ఆ కంపెనీ మేనేజర్ వివరాలు అందించాలని లేఖలో రాబిన్ గుప్తా పేర్కొన్నారు. ఏఏఐ ఆ లేఖను చెన్నై, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని విమానాశ్రయాల డైరెక్టర్లకూ పంపించి, వివరాలను సేకరించి ఆ మరుసటిరోజే ఈడి అధికారులకు అందించినట్టు సమాచారం.

బేగంపేట నుంచి తరలించారు
ఎన్ఫోర్స్మెంట్ నుంచి లేఖ రావడంతో ఏఏఐ అప్రమత్తమైంది. బేగంపేట విమానాశ్రయం నుంచి నగదు తరలించినట్టు ఈడీ కి ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. అక్కడినుంచి ప్రైవేటు చార్టర్డ్ విమానాల రాకపోకలపై ఏఏఐ నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రోటోకాల్ కలిగిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఇచ్చింది.. ప్రైవేట్ విమానాలను శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనుమతిస్తోంది.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్ర రెడ్డి భార్య అయిన కనికకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలతో పాటు, ఢిల్లీ స్థాయిలోనూ కీలక నేతలతో పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోంది.. విజయసాయిరెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది రాజకీయ నేతలు, ప్రముఖులు ఆమె విమానాల్లో పలు ప్రాంతాలకు వెళ్లినట్టు సమాచారం.. ఆ ప్రముఖుల అండతోనే బేగంపేట విమానాశ్రయం నుంచి విమానాల్లో నగదును తరలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మరింతమంది రాజకీయ నేతల పాత్ర పై దర్యాప్తు సంస్థల అధికారులు ఉచ్చు బిగించే అవకాశం కనిపిస్తోంది. అయితే మొన్నటిదాకా ఈడి, బోడి అన్న టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అయితే ఈ కనికా టెక్రివాల్ రెడ్డి కి ఎమ్మెల్సీ కవితతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా కూడా ఈడి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.