Mahesh Babu- Krishna: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు విషయంలో మహేష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక సామాన్యుడు మాదిరి మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరపడం సర్వత్రా అసహనం వ్యక్తం అవుతుంది. ప్రముఖుల అంత్యక్రియలు వారసులు తమ సొంత ప్రైవేట్ ప్రాపర్టీస్ లో నిర్వహిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖుల అంత్యక్రియలు అలాగే జరిగాయి. ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి కావడంతో ప్రభుత్వం స్థలం కేటాయించింది. అక్కడ ఆయనకు అంత్యక్రియలు జరిపి స్మారకం నిర్మించారు. ఇక ఏఎన్నార్ అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోలో చేశారు.

సెప్టెంబర్ 11న కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు హీరో ప్రభాస్ మొయినాబాద్ లో గల ఫార్మ్ హౌస్ లో పూర్తి చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలును సైతం చెన్నైలో గల ఆయన సొంత ప్రాపర్టీలో ఖననం చేశారు. ప్రజాదరణ కలిగిన నటులు, నాయకులు చనిపోతే అంత్యక్రియలు పూర్తి చేసి స్మారకం నిర్మించడం ఒక సంప్రదాయంగా ఉంది. అందుకే స్మశానాల్లో అంత్యక్రియలు నిర్వహించరు.
వెండితెరపై చరిత్ర సృష్టించిన కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించడం పై అభిమానులు, చిత్ర ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కుటుంబానికి చెందిన 30-40 ఎకరాల స్థలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కృష్ణ ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న పద్మాలయ స్టూడియోని అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే అక్కడే మరో 5 ఎకరాల స్థలం ఉందట.

పద్మాలయ స్టూడియోకి ప్రత్యామ్నాయంగా మహేశ్వరం ప్రాంతంలో కృష్ణ కొంత స్థలం కొన్నారు. దాని పక్కనే మహేష్ కొనుగోలు చేసిన 30 ఎకరాల స్థలం ఉన్నట్లు సమాచారం. మరి ఇన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండగా మహేష్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఆగ్రహానికి గురి చేస్తుంది. సొంత స్థలంలో అంత్యక్రియలు జరిపి స్మారకం నిర్మించి ఉంటే ఆయనకు గౌరవం ఇచ్చినట్లు ఉండేది అంటున్నారు. భార్య విజయనిర్మల బ్రతికి ఉంటే ఇలా జరగనిచ్చేది కాదని అంటున్నారు. తమ్ముడు ఆదిశేషగిరిరావు, రమేష్ బాబు భార్య మృదుల కూడా మహా ప్రస్థానంలో అంత్యక్రియలు వద్దన్నారని సమాచారం.