
MLA Tatikonda Rajaiah- Woman Sarpanch: చెప్పేవి శ్రీరంగ నీతులు.. వేసేవి చిల్లర వేషాలు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఏవేవో చెబుతూ ఉంటారు. చెడు వినకు, చెడు మాట్లాటకు అంటూ వేదాలు వల్లిస్తుంటారు. కానీ తాము మాత్రం ఆ చెడ్డ పనులతోనే గడిపేస్తుంటారు. సమాజంలో బాధ్యతాయుతమైన నేతగా నటిస్తుంటారు.. తెరచాటున మాత్రం తమలో ఉన్న వికృత క్రీడను చూపిస్తుంటారు. ఇప్పుడు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ సర్పంచ్ నే నేరుగా పిలిచారంటే ఆయనలో ఉన్న వికృత కామక్రీడ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. భర్త పక్కనే ఉండగా ఆమె తనకు జరిగిన అవమానాన్ని చెప్పిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
వృత్తిరీత్యా డాక్టర్, ఆపై సీనియర్ నాయకుడు. అందుకే కాబోలు కేసీఆర్ ఆయనకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. కానీ ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు. తన వయసు మరిచి, సభ్య సమాజం తలదించుకునేలా లైంగిక వేధింపులకు గురిచేయడం మాత్రం క్షమించరాని నేరం. ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో అనేకమార్లు రాజయ్యపై మహిళలు ఆరోపణలు చేశారు. గతంలో తన బర్త్‌డే వేడుకల్లోనూ మద్యం మత్తులో ఓ మహిళా నేత నోట్లో వేలు పెట్టి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నియోజకవర్గంలో నిర్వహించిన ఓ సమావేశంలో నియోజకవర్గంలో చాలా మందికి నా కారణంగానే పిల్లలు పుట్టారని వ్యాఖ్యానించాడు.

అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే సొంత పార్టీ సర్పంచ్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ లైంగిక వేధింపులను బయటపెట్టడం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపెల్లి సవ్యపై రాజయ్య కన్నేశారు. ఇటువంటి రాచకార్యాల కోసం పెట్టుకున్న ఎమ్మెల్యే మనుషులు నవ్యతో రాయబారం నెరిపారు. అయితే అందుకు సదరు సర్పంచ్ అంగీకరించలేదు. దీంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష మొదలైంది. ఇటీవల అది తీవ్రమైంది. దీంతో ఎమ్మెల్యే ఆగడాలు బయటపెడితే కానీ పరిస్థితి కొలిక్కి రాదని భావించిన సర్పంచ్ నవ్య నేరుగా విలేఖర్ల సమావేశం పెట్టి మరీ రాజయ్య పరువు తీసేశారు.
అచ్చం సినిమాల్లో విలనీజం టైపులోనే నేరుగా రాజయ్య కోరికల చిట్టా విప్పినట్టు తెలుస్తోంది. మీరు నా తండ్రి వయసున్న వారని.. అలా అడగడం చాలా తప్పు అని వారించినట్టు సర్పంచ్ నవ్య చెబుతోంది, అంగీకరించకపోవడంతో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిల వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయభారం నడిపిన వారిపై కూడా ఆమె ఫైర్ అయ్యారు. ‘మీకు అక్కాచెల్లెల్లు లేరా అని నిలదీశారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తే మానానికి కూడా రక్షణ లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు నవ్యవి తప్పుడు ఆరోపణలని బీఆర్ఎస్ మహిళా నేతలు చెబుతున్నారు. రాజయ్య రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక ప్రత్యర్థులు ఈ పనిచేయించారని ఆరోపిస్తున్నారు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన లైంగిక వేధింపులపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.
