Moinabad Farmhouse Episode Audio Leak: తెలంగాణలో రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని అడుగులు వేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి మరిన్ని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో రామచంద్ర భారతి స్వామి, నందకుమార్ లు మాట్లాడిన ఆడియో కాల్ బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగుతోంది.

మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందు కేసీఆర్ తమపై నిఘా పెట్టారని రోహిత్ రెడ్డి చెప్పిన మాటలు బహిర్గతం కావడం సంచలనం కలిగిస్తోంది. ఆడియో కాల్ లో రోహిత్ రెడ్డితో స్వామీజీ రామచంద్ర భారతి మాట్లాడిన మాటలు ఆశ్చర్యం నింపుతున్నాయి. మీరు మా పార్టీలోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు సరైన స్థానం కల్పిస్తాం. అంతా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలుగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రోహిత్ రెడ్డి చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యేల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన పని నందు చూసుకుంటున్నాడు. అతడి ప్రోద్బలంతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం బహిర్గతమైతే తమకు నష్టమని రోహిత్ చెప్పగా సాధ్యమైనంత గోప్యతగా ఉంచుతామని స్వామీ హామీ ఇచ్చారు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీఎల్ సంతోష్ అన్ని చూసుకుంటారు. నాకు మధ్యవర్తులు ఎవరు లేరని స్వామీజీ చెప్పడంతో ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తానని రోహిత్ చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో స్వామీజీ సూచనతో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు వారితో కుమ్మక్కవ్వడం టీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల తీరుతో టీఆర్ఎస్ కూడా ఎంతో భయం వ్యక్తం చేస్తోంది. గతంలో టీఆర్ఎస్ కూడా ఇలాగే వ్యవహరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ దారికి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఆడియో కాల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలను కుదిపేస్తోంది. స్వామీ రామచంద్ర భారతి, రోహిత్ రెడ్డి మాటలతో కూడిన కాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బేరసారాల కథ అందరిలో హాట్ టాపిక్ గా మారుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ వారిని దొంగలుగా అభివర్ణిస్తున్నారు. దీనిపై ఎవరు కూడా కామెంట్లు చేయకూడదని హితలు పలకడం గమనార్హం.