Congress Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈమేరకు పీసీసీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కూడా కలిశారు. ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఎస్ కూడా కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు పలు సూచనలు చేశారు.
మంత్రివర్గం ఖరారు..
ఇదిలా ఉండగా, ఢిల్లీలో తెలంగాణ మంత్రివర్గం కూర్పు దాదాపు పూర్తయింది. అంతకుముందు తెలంగాణ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు ఏఐసీసీ పరిశీలకుడు డీకే.శివకుమార్‌ను కలిశారు. మంత్రివర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. సమావేశం అనంతరం ఉత్తమ్ మొదట బయటకు వచ్చారు. భట్టి కాసేపు చర్చించి వెళ్లిపోయారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, తనకు స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. మంత్రివర్గంలో తనకు సముచిత స్థానం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూడా తనకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డీకే.శివకుమార్‌ను కోరారు. మరోవైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారమే సోనియాగాంధీని కలిశారు. మంత్రివర్గ కూర్పులో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని విన్నవించారు.
ఎంపిక పూర్తి..
ఇదిలా ఉండగా, మధ్యాహ్నం తర్వాత డీకే.శివకుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రివర్గ కూర్పు పూర్తయిందని తెలిపారు. తీవ్ర కసరత్తు, అనేక తర్జన భర్జనల తర్వాత తుది రూపు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈమేరకు ఎంపిక చేసిన పేర్లను ఏఐసీసీ అధ్యక్షుడికి అందించినట్లు తెలిపారు. సాయంత్రం లేదా.. గురువారం ఉదయం ఎంపిక చేసిన వారికి సమాచారం అందిస్తామన్నారు.