ఎన్టీఆర్ బర్త్ డే: యుగానికొక్కడు!

యుగానికి ఒక్కడు.. తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన మహా పురుషుడు.. ఆయన మాట ఒక సంచలనం.. ఆయన బాట స్ఫూర్తిదాయకం.. తెలుగుజాతి సినిమాను మలుపు తిప్పిన మహా సంకల్పం.. రాజకీయాల్లో ప్రభంసనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవ పతాక.. ప్రజాహిత పాలనతో ప్రజలకు చేరువైన మహానాయకుడు.. సంక్షేమ పథకాలకు ఊపిరిపోసిన మహనీయుడు.. ఆయనే ‘నందమూరి తారక రామారావు’.. ముద్దుగా తెలుగోళ్లు అంతా ‘ఎన్టీఆర్’ అని పిలిచే ఆ సీనియర్ తారకరాముడి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.. […]

Written By: NARESH, Updated On : May 28, 2021 4:21 pm
Follow us on

యుగానికి ఒక్కడు.. తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన మహా పురుషుడు.. ఆయన మాట ఒక సంచలనం.. ఆయన బాట స్ఫూర్తిదాయకం.. తెలుగుజాతి సినిమాను మలుపు తిప్పిన మహా సంకల్పం.. రాజకీయాల్లో ప్రభంసనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవ పతాక.. ప్రజాహిత పాలనతో ప్రజలకు చేరువైన మహానాయకుడు.. సంక్షేమ పథకాలకు ఊపిరిపోసిన మహనీయుడు.. ఆయనే ‘నందమూరి తారక రామారావు’.. ముద్దుగా తెలుగోళ్లు అంతా ‘ఎన్టీఆర్’ అని పిలిచే ఆ సీనియర్ తారకరాముడి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

దివి నుంచి భువికి దిగివచ్చిన ఓ దేవుడిలా ఎన్టీఆర్ ను తెలుగు నాట కొలుస్తారు. కృషితో కష్టపడి ఎదిగి సినీ ఇలవేల్పు అయ్యి.. రాజకీయాల్లోకి వచ్చి పేదరిక నిర్మూలననుంచి సంక్షేమ రాజ్యం వరకు స్థాపించి తెలుగు నాట దేవుడు అయిన యుగపురుషుడు ఎన్టీఆర్. నేడు ఆయన 98వ పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుందాం.

*నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్
1923 మే 28న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు ఎన్టీఆర్ జన్మించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులోనే మేనమామ కుమార్తె బసవతారకంను పెళ్లి చేసుకున్నాడు. బసవ తారకం -ఎన్టీఆర్ దంపతులకు 11 మంది సంతానం. 11 మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు. లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి కుమార్తెలు.

33 ఏళ్ల సినిమా జీవితం.. 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా తెలుగు నాట చెరిగిపోని ముద్రవేసిన ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటుతో 1996 జనవరి 18న 73 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక, జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరిత పాత్రలు ఎన్నో చేశారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు నాట దేవుడై నిలిచాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఎన్టీఆర్ నటించారు. నిర్మాత, దర్శకుడిగా పలు చిత్రాలు నిర్మించారు.

1982 మార్చి 29న హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేవలం 10 మంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపిస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. ఇది నిరుపేదల కష్టాలు తీర్చే పార్టీగా ప్రకటించారు. ఎన్టీఆర్ నిర్ణయానికి నాటి కాంగ్రెస్ ఢిల్లీ కోటలు కదిలాయి.. రాజ్యసభ సీటు ఇస్తాం పార్టీ వద్దంటూ బేరసారాలు చేశారు. ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు.

పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి.. చైతన్య రథంతో ఏపీ వ్యాప్తంగా తిరుగుతూ దశాబ్ధాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను మట్టికరిపించాడు. ఢిల్లీ నాయకులను బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు. 2 రూపాయలకు కిలో బియ్యం సహా ఎన్నో సంక్షేమ పథకాలు.. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో సంస్కరణలు చేపట్టి పేదల కష్టాలు తీర్చి నాయకుడంటే ఇలా ఉండాలని పాలించి చూపించారు. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ‘పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం’ అని పిలుపునిచ్చిన గొప్ప మనిషి ఎన్టీఆర్.

నాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ దేశంలోనే ప్రతిపక్షంగా ఎదిగిదంటే అది ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులే.. ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలే గొప్ప నాయకుడిగా మార్చాయి. తెలుగుజాతికి ఇప్పటికీ మరిచిపోని ఒక గొప్ప నటుడిని గొప్ప రాజకీయ నాయకుడిని ఇచ్చాయి. ఆయన మరణం తెలుగుజాతికి తీరని లోటు.. యుగానికి ఒక్కడు ఇలా పుడుతాడు.. ఆయనే ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జై హో ఎన్టీఆర్.

-నరేశ్ ఎన్నం