Telangana Congress: వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ ఖాళీ అవుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశాన్ని దాదాపు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ గడిచిన ఎనిమిదేళ్లుగా గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఓటమి తప్పడం లేదు. ఆ పార్టీపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడం.. బీజేపీ హిందుత్వ ఎజెండాను బలంగా దేశ ప్రజల్లోకి తీసుకెళ్లడం, భారతీయత అంటే హిందుత్వం అన్న నినాదం ప్రజల్లో నెలకొనడంతో కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. దీంతో ఏ ఎన్నికలు వచ్చినా ఆ పార్టీకి ఓటమి తప్పలడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది సీనియర్లు పార్టీని వీడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవుతోంది.

తాజాగా తెలంగాణ వంతు..
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో గుర్తింపు ఉంది. కానీ ఎన్నికల సమయంలో దానిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోంది. మరోవైపు పార్టీలో అతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ పతనానికి కారణమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌ను జాకీలు పెట్టి లేపినా లేవని పరిస్థితి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కొంత ఉత్సాహం కనిపించింది. కానీ ఎన్నికలకు వచ్చే సరికి కనీసం రెండో స్థానంలో కూడా ఆ పార్టీ నిలవలేకపోతోంది. హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఉప ఎన్నికలు జరిగాయి ఒక్క నాగార్జున సాగర్‌లో మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్ దక్కింది. మిగతాచోట్ల డిపాజిట్ కూడా రాలేదు. మునుగోడులో అయితే సిట్టింగ్ స్థానం కావడంలో పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ఇక కాంగ్రెస్ ఖతం అయిందన్న భావన పార్టీ నేతల్లో నెలకొంది. దీంతో పార్టీని వీడేందుకే చాలామంది మొగ్గుచూపుతున్నారు. ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
పార్టీ వీడుతున్న నేతలు..
మునుగోడు తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. పార్టీలో ఉంటే ఇక ఎలాంటి ప్రయోజనం ఉండదన్న భావనకు వచ్చారు. ఈ క్రమంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కూడా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిశారు. దీంతో పార్టీని వీడడం ఖాయమైంది. హైదరాబాద్‌కే చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డికి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ముందు నుంచి ఏమాత్రం పొసగట్లేదు. వీరేకాదు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమౌతున్నట్లు ప్రచారం జరుగుతోంది..
అందరి చూపు బీజేపీ వైపే..
కాంగ్రెస్‌ను వీడుతున్న నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో సిట్టింగులకే ఎమ్మెల్యే టికెట్లు అని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ పార్టీలోనే చాలా మంది ఆశవహులు అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది పార్టీని వీడాలనుకుంటున్నారు. ఇంకొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ను వీడే నేతలు ఎలాగూ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదు. వాళ్లు కూడా బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు ముందు పెట్టేపేడ సర్దుకుంటున్నారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీఆర్‌ఎస్ అసంతృప్తులు చేరకముందే కమలం గూటికి చేరేలా ప్లాన్ చేసుకుంటున్నారు. టికెట్ హామీలో కాషాయం కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు.

బలపడుతున్న కమలం..
రాష్ట్రంలో బీజేపీ బలోపేతం దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్‌తోపాటు టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులు.. బీజేపీ మాత్రమే తమకు ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ బీజేపీకి అభ్యర్థులే లేరన్న ఆరోపణల నుంచి ఆ పార్టీకూడా కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులు ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సంకేతాలు ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచుతున్నాయి. చేరికలతోపాటు, ప్రజాభిప్రాయం తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.