Security Failure in Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో మరో సారి బయట బడ్డ టీటీడీ విజిలేన్స్ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సీఎమ్ఓ స్టికర్ కలిగిన ఇన్నోవా వాహనం ఆలయ మాడ వీధుల్లో హల్ చల్ చేయడం కలకలం రేపింది. టిటిడి నిబంధనలను అతిక్రమించి శ్రీవారి ఆలయ మాడవీధిలోకి ప్రవేశించిన ఇన్నోవా వాహనంపై ‘సీఎంవో’, ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కర్లు ఉండడంతో నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేశారని విమర్శలు వచ్చాయి.

మాడ వీధుల్లో ప్రైవేటు వాహనాల రాకపోకలపై టీటీడీ నిషేధం విధించింది. కానీ ఆ వాహనం మాత్రం మాడవిధుల్లో చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. మాడవీధుల నుంచి కారు బయటకు రావడం అందులో కనిపించింది. కారులో మాడవీధుల్లోకి ఎవరు? ఎందుకు వెళ్లారు? వారికి అనుమతి ఇచ్చింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవలే శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నో ఫ్లైజోన్ లో ఉన్న శ్రీవారి ఆలయం ప్రాంగణంలోకి డ్రోన్ వెళ్లడం దుమారం రేపింది. ఈ వ్యవహారంలో ఒకరిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు మాడవీధుల్లో కారు తిరుగుతూ కనిపించడం విమర్శలకు తావిచ్చింది.
అయితే దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది. సిఎంఓ స్టిక్కరు గల వాహనం మాడ వీధుల్లోకి ప్రవేశించలేదని టిటిడి తెలిపింది. సిఎంఓ స్టిక్కరు గల ఒక వాహనం శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి ప్రవేశించిందని మంగళవారం కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొంది. ఆలయ మాఢ వీధుల్లోకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను టిటిడి నిషేధించింది. ప్రముఖుల వాహనాలను వాహనమండపం పక్కన గల సెక్యూరిటీ గేటు వద్దకు మాత్రమే అనుమతిస్తారు. అయితే శ్రీవారి ఆలయం నుండి రాంభగీచా గేటు వద్దకు వృద్ధులు, దివ్యాంగులను తీసుకెళ్లే బ్యాటరీ వాహనం కోసం ఈ సెక్యూరిటీ గేటును తీసి ఉంచారు. ఈ గేటు పక్కనే దాతల ద్వారా అందే వాహనాలను, అంబులెన్సును ఉంచుతారు. సదరు వార్తలో పేర్కొన్న ఈ వాహనాన్ని ఇక్కడే పక్కకు తిప్పుకున్నారు. అంతేగానీ మాడవీధుల్లోకి ఈ వాహనం ప్రవేశించలేదని టీటీడీ ప్రకటించింది.
టిటిడి అధికారుల భద్రతా వైఫల్యం వల్లే మాడవీధుల్లోకి ఈ వాహనం ప్రవేశించిందని సదరు వార్తలో పేర్కొనడం బాధాకరమన్నారు. భక్తులు ఇలాంటి వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.