Corona Cases: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పాఠశాలలు ఆగస్టు 16 నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా (Corona) కారణంగా గతేడాది మార్చి 15 నుంచి మూతపడిన పాఠశాలలు ఎట్టకేలకు ప్రారంభమైనా వైరస్ ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు విధించినా వాటిని ఆచరణలో పాటించడం లేదు. ఫలితంగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ల నిర్వహణపై అప్పుడే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే విద్యాసంవత్సరం కోల్పోవడంతో ఈసారైనా అలా జరగకుండా ఉండాలని భావిస్తున్నా అది సాధ్యం కాదేమోనన్న అనుమానాలు వస్తున్నాయి.
పాఠశాలలు ప్రారంభమైన రెండు వారాల్లోనే 13 జిల్లాల్లో 232 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. కృష్ణ జిల్లా పెదపారుపూడి పాఠశాలలో 12 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో బడిని మూసేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి పాఠశాలలో, వెలిగొండ మండలం వెదుళ్లపల్లి పాఠశాలల్లో 9 మంది విద్యార్థులు కరోనాకు గురయ్యారు. ఒంగోలు పీవీఆర్ బాలికల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రకాశం జిల్లాలో 22 మంది విద్యార్థులు కరోనా ప్రభావానికి గురయ్యారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ గ్రామంలో, విశాఖపట్నంలోని గోపాలపట్నంలో కూడా విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పాఠశాలల మనుగడపై ఏ నిర్ణయం తీసుకుంటారో అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోవడంతోనే విద్యార్థులకు కరోనా వ్యాపిస్తుందని తెలుస్తోంది. భౌతిక దూరం, శానిటైజర్, థర్మల్ స్రీనింగ్ తదితర విషయాల్లో కచ్చితమైన నిబంధనలు పాటించకపోవడంతోనే ఇలా జరుగుతుందని వాదన వినిపిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో అయితే తరగతి గదుల కొరతతో ఒక్కో గదిలో 50 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. దీంతో కరోనా సులభంగా అంటుకునే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులు, ఉఫాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారని సమాచారం. పాఠశాల గేటు వద్దే థర్మల్ స్రీనింగ్ చేసి విద్యార్థి స్థితిని అంచనా వేసి పంపాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.
కరోనా నిర్మూలనలో ప్రధాన ఆయుధం మాస్క్. ఇవి పిల్లలకు సరిగా ఉండడం లేదు. దీంతో వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తోందని చెబుతున్నారు. మాస్కులు కొందరైతే మెడలో వేసుకుంటున్నారు. ఇంకొందరు ముక్కు కిందకు వేలాడదీసుకుంటున్నారు. దీంతో కరోనా విజృంభణ కొనసాగే సూచనలు ఎక్కువ అవుతున్నాయి. వీటిపై ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతోనే కరోనా బారిన పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.