హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కల్తీ నూనెల “గల్తీ” దందా ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ప్రాణసంకటంగా మారింది. “కల్తీగాళ్ళ” భరతం పట్టి కల్తీ వ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన వివిధ శాఖల అధికారులు, కల్తీగాళ్ళ మధ్య బంధం భార్యాభర్తల్లాగా పెనవేసుకుపోయింది. కల్తీగాళ్ళ వ్యాపారానికి కొందరు అధికారులు ఇతోధికంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో కల్తీగాళ్ళ వ్యాపారం మూడు ప్యాకెట్లు, ఆరు డ్రమ్ములుగా వర్ధిల్లుతోంది. పండగ సందర్బంగా “కల్తీ నూనెల పై” ప్రత్యేక కథనం…
Also Read: దసరా తర్వాతే ఆర్టీసీ బస్సులా?
పండగ సందర్భాన్ని ఆసరగా చేసుకున్న కల్తీ వ్యాపారుల మాఫియా వినియోగదారులకు భారీ ఎత్తున కల్తీ వంటనూనెలను అంటగడుతున్నారు . ఈ నూనెలను హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లతోపాటు నిత్యం ఇళ్లల్లో వాడే వంటల్లో ఈ కల్తీ నూనెలను వాడుతున్నారు. కల్తీ నూనెల వాడకంతో వినియోగదారులు ఊపిరి తిత్తుల కాన్సర్, కిడ్నీస్ ఫెయిల్యూర్, హార్ట్ ఎట్టాక్ వంటి అనేకమైన ప్రమాదకర రోగాల బారినపడుతున్నారు. పెద్దపల్లి కేంద్రంగా కల్తీ నూనెల దొంగ వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాలు హైదరాబాద్ నుంచి కల్తీ వంటనూనెలను దిగుమతి చేసుకొని బ్రాండెడ్ కంపెనీలను పోలిన ఆకర్షణీయమైన ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి హైదరాబాద్ తోపాటు, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని వంటి పట్టణాలు, గ్రామాల్లోని కిరాణా షాపుల ద్వారా వినియోగదారులకు అంటగడుతున్నారు.
హైదరాబాద్ లోని శివారు ప్రాంతాల్లో మాఫియా ముఠాలు కల్తీ నూనెల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. కల్తీ నూనెల తయారీ ముఠాలు… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెలు, పట్టణాల్లోని కబేళాల ద్వారా సేకరించిన వ్యర్థాలతో కల్తీ నూనెలను తయారుచేస్తున్నారు. పశువుల బొక్కలు, కొవ్వు, కొమ్ములు, పుర్రెలు, చికెన్ సెంటర్ల ద్వారా సేకరించిన కోళ్ల వ్యర్థాలను, పందుల కొవ్వులను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఉడకపెట్టి ఒకవిధమైన ఆయిల్ ను తయారు చేస్తున్నారు . దీనికి పల్లి, పొద్దుతిరుగుడు నూనెల వాసన వచ్చేలా కొన్ని రసాయనాలు(ఫ్లేవర్స్)కలుపుతున్నారు. దీన్ని, కల్తీ దందాలకు పాల్పడే ముఠాలు స్వచ్ఛమైన పల్లి, పొద్దుతిరుగుడు నూనెల్లో కలిపి ఆకర్షనియమైన ప్యాకెట్లలో కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నారు. దీంతో అసలు ఏది నకిలీ ఎదో ఓరిజనల్ అనేది పట్టలేనంతగా ఉంటున్నాయి. పత్తి జిన్నింగ్ మిల్లుల్లో వ్యర్థంగా మిగిలిన పత్తిగింజల నుంచి తీసిన నూనెను కూడా కల్తీకి వాడుతున్నారు. వీటిని సామాన్యులు గుర్తించలేరు.
దసరా పండగ సందర్బంగా కేవలం హైదరాబాద్ లోనే జరిగే వంట నూనెల క్రయవిక్రయాల విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. దీనికి దీపావళి, రంజాన్, క్రిస్మస్ వంటి పండగలకు, రోజువారీ వంటల్లో ఉపయోగించే నూనెల వినియోగపు ఖర్చు అదనం. అంటే కేవలం జిల్లా కేంద్రంలో సంవత్సరం పాటు వినియోగించే వంట నూనెల క్రయ విక్రయాల వ్యాపారం ఎంతలేదన్నా 100కోట్ల పైమాటే. దీనిలో కల్తీ నూనెల వాటా 40కోట్ల వరకు ఉంటుందని తూనికలు కొలతలు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే ఓ పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి తెలిపారు.
Also Read: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీడియా?
ప్రతీరోజు పండగలా ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో వినియోగించే నూనెల్లో 70శాతం కల్తీయే అని సదరు అధికారి పేర్కొన్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో పట్టుబడే 10కేసుల్లో 4కేసులు కల్తీ నూనెలకు సంభందించినవేనని “ఈ” అధికారి పేర్కొన్నారు. కొందరు… క్వాలిటీ కంట్రోల్, తూనికలు కొలతలు,ఫుడ్ ఇన్స్పెక్టర్ల బ్యాంకు అకౌంట్ల ఎంక్వయిరీకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ లేదా సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ను ఏర్పాటు చేస్తే వందల కోట్ల ఆదాయానికిమించిన అక్రమాస్తులు బయట పడతాయని “ఈ” అధికారి తెలిపారు.
దీన్నిబట్టి, హైదరాబాద్ తోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో జరిగే కల్తీ నూనెల దందా స్థాయిని,కల్తీ మాఫియా ముఠాలతో(కొందరు) క్వాలిటీ కంట్రోల్, తూనికలు కొలతలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఉన్న ‘ఆత్మీయ అనుబంధాన్ని’ అర్థం చేసుకోవచ్చు.ప్రజల ఆరోగ్యం కన్నా… కల్తీ ముఠాలు విసిరే ఎంగిలి మెతుకులే మిన్నగా కొందరు అధికారులు భావిస్తున్నంత కాలం ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు తప్పదు.