EWS Reservation Gujarat: రాజకీయాల్లో రాణించాలంటే వ్యూహం ఉండాలి. దానికి మించి చతురత ఉండాలి. ఇక వ్యూహం, తోడైతే ఇక అడ్డు ఉండదు. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇన్నాళ్లు అక్కడ కాంగ్రెస్ తన ప్రధాన పోటీదారు అని బిజెపి అనుకున్నది. ఇప్పుడు తెరపైకి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. గుజరాత్ అంటే వ్యాపారం.. వ్యాపారం అంటేనే గుజరాత్.. ఆ మధ్య తమకు రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్ లో పెద్ద ఎత్తున పటేళ్ళు ఆందోళన చేశారు. ఇది ఒకానొక దశలో రచ్చ రచ్చగా మారింది. దీంతో గత్యంతరం లేక బిజెపి ఒక అడుగు వెనక వేసింది. మళ్లీ ఈసారి గుజరాత్ ఎన్నికలు వచ్చాయి. ఈసారి కూడా అవే తరహా ఆందోళనలు జరగకుండా మోడీ ముందుగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారు. డాక్టర్ సిఫారసు చేసింది పెరుగు అన్నమే.. రోగి కోరుకున్నది కూడా పెరుగన్నమే.. సామెత తీరుగా మోదీ మదిలో ఉన్న కాగల కార్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం చేసి పెట్టింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాల రిజర్వేషన్లపై సోమవారం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన 13వ రాజ్యాంగ సవరణకు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3/2 తేడాతో ఆమోదముద్ర వేసింది. ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించడం సహేతుకమైన వర్గీకరణగా పేర్కొన్నారు. ఈ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని పేర్కొన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రాతిపదికన తెచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాపై అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. కానీ ఇందులో నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలో పేదలను మినహాయించడం సహితుకం కాదంటూ రాజ్యాంగ సవరణను తన తీర్పులో కొట్టేశారు. బట్ అభిప్రాయంతో ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ఏకీభవించారు.

2019లోనే..
ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్య, యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో 13వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. దీనికి పార్లమెంట్ లోని ఉభయ సభలు అదే ఏడాది జనవరిలో ఆమోదం తెలిపాయి. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 40 పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం మూడు కీలక అంశాలను చాలా లోతుగా పరిశీలించింది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన 103వ సవరణ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా? ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన పేదలను విస్మరించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించినట్టా? ఈ సవరణ వల్ల 50 శాతం కోట పరిమితిని దాటినట్టు అవుతుందా? అనే ప్రశ్నల పై దృష్టి సారించింది. అయితే సోమవారం జరిగిన విచారణలో మెజారిటీ తీర్పు ఇచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు తమ తీర్పులో వీటికి పూర్తి సమాధానం ఇచ్చారు.
ఎవరెవరు ఏమన్నారు అంటే
ధర్మాసనంలో మెజారిటీ సభ్యులు తీర్పును జస్టిస్ దినేష్ మహేశ్వరి చదివి వినిపించారు. ” సమాజంలో అసమానతలు ఉన్నప్పుడు సమాన సమాజాన్ని సాధించే లక్ష్యంతో అందరినీ కలుపుకొని పోవడానికి ప్రభుత్వపరంగా తీసుకున్న దృఢమైన చర్య రిజర్వేషన్. అది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన పరికరం ఒకటే కాదు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఏ తరగతి నైనా, వర్గాన్నయినా చేర్చుకొని వారి బలహీనతకు పరిష్కారం చూపే మార్గం కూడా. కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగంలోని ఏ ముఖ్యమైన లక్షణాన్ని ఉల్లంఘించదు.”అని ఆయన వివరించారు.
బేలా త్రివేది: ” 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం సమాజ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మొత్తం రిజర్వేషన్లను పునః పరిశీలించాలి. 2020లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్, శాసనసభల్లో ఆంగ్లో ఇండియాలకు రిజర్వేషన్లు రద్దు చేశారు. అతి తరహాలో రాజ్యాంగంలోని అధికరణం 15,16 కింద కల్పించిన రిజర్వేషన్లు, ప్రాతినిధ్యాలకు నిర్దిష్ట గడువు విధిస్తే అది సమతుల్యమైన కుల, వర్గ రైతు సమాజానికి మార్గం సుగమం చేస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.

జెబీ పార్దీవాలా:” రిజర్వేషన్లు ఉన్నది సామాజిక, ఆర్థిక న్యాయం చేసేందుకు.. అవి స్వార్థపూరితంగా మారెందుకు అవకాశం ఇవ్వకూడదు. వెనుకబడిన తరగతులకు చెప్పుకోదగిన స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో ఆమోదయోగ్యమైన ప్రమాణాలు అందుకున్నారు.. అందువల్ల వారిని వెనుకబడిన తరగతుల కేటగిరి నుంచి తొలగించాలి.. దానివల్ల నిజంగా సాయం అవసరమైన వారిపై దృష్టి పెట్టేందుకు వీలు అవుతుంది.. ఇలాంటి పరిస్థితుల్లో వెనుకబడిన తరగతులను నిర్ధారించే మార్గాలను గుర్తించే విధానాలను సమీక్షించాల్సిన అవసరం కూడా చాలా ఉంది.. కేవలం పదేల కాలానికి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సుహృద్భావం నెలకొల్పాలన్నదే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన. కానీ అవి ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి” అని వివరించారు.
రవీంద్ర భట్: ” 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తోంది. సమాన అవకాశాలు, ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వేషన్లు శక్తివంతమైన ఆయుధంగా రూపొందాయి. ఇప్పుడు కొత్తగా ఆర్థిక కులమాల ఆధారంగా రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడం ఆమోదయోగ్యమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారన్న కారణంతో వారిని ఈ రిజర్వేషన్ నుంచి మినహాయించడం సరికాదు. వారు సమాజంలో నిరుపేదలుగా ఉన్నప్పటికీ “ఇతరులు” పేరుతో ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు. వాస్తవానికి కులం, తరగతితో సంబంధం లేకుండా అత్యంత నిరుపేదలను దీని పరిధిలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అవకాశం కల్పించినట్లు అయింది.. రాజ్యాంగపరంగా వెనుకబడిన తరగతులకు గుర్తింపు పొందిన ప్రజలను పూర్తిగా ఈ రిజర్వేషన్ల నుంచి విస్మరించడం వివక్ష తప్ప మరొకటి కాదు” అని ఆయన తెలిపారు.
ఇది మోడీ విజయం
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పును బిజెపి స్వాగతించింది. ప్రధాని మోడీ సాధించిన విజయంగా పేర్కొంది. సామాజిక న్యాయం దిశగా ఇది మరో పెద్ద ముందడుగు అని ఆ పార్టీ నాయకులు అభిమానిస్తున్నారు. కొంతమంది బిజెపి నాయకులు ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రైవేటు రంగంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సుప్రీంకోర్టు అగ్రవర్ణ మనస్తత్వానికి ఈ తీర్పు నిదర్శనం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అధికారికంగా హర్షం వ్యక్తం చేసింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తాము తీసుకున్న చొరవ కారణంగానే ఈ రాజ్యాంగ సవరణ జరిగిందని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. తీర్పు తనను పూర్తిగా నిరాశపరిచిందని ఆయన వ్యాఖ్యానించారు.