Savings Accounts : సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీలు వేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది చాలా మందికి పెద్ద తలనొప్పిగా ఉండేది. అయితే, ఇప్పుడు కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ చార్జీల నుంచి మినహాయింపు అందిస్తున్నాయి. ముఖ్యంగా, ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి పెద్ద బ్యాంకులు ఈ విషయంలో కీలక ప్రకటన చేశాయి. మరి, ఇప్పటివరకు ఏయే బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేశాయో, ఆ వివరాలు చూద్దాం.
ఈ 5 బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు రద్దు చేశాయి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
మన దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ. ఇది చాలా ఏళ్ల క్రితమే అంటే 2020లోనే తమ సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా చార్జీలు వేయడం ఆపేశారు. కాబట్టి, ఎస్‌బీఐ కస్టమర్లు ఈ విషయంలో ఎప్పటి నుంచో సంతోషంగా ఉన్నారు.
Also Read: ‘వార్ 2’ కి 5 భాషల్లో డబ్బింగ్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..మరి హృతిక్ రోషన్ పరిస్థితి ఏంటి?
కెనరా బ్యాంక్
ఈ బ్యాంక్ కూడా కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఏడాది మే నెలలోనే ఒక ప్రకటన చేసి, జులై 1, 2025 నుంచి తమ అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు (మామూలు సేవింగ్స్, శాలరీ అకౌంట్స్, ఎన్‌ఆర్‌ఐ అకౌంట్స్) మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు తీసేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పీఎన్‌బీ కూడా తన అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1, 2025 నుంచి తమ బ్యాంక్‌లోని అన్ని సేవింగ్స్ అకౌంట్ల మీద మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు ప్రకటించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఈ జాబితాలో చేరింది. జులై 2, 2025న Xలో ఒక ప్రకటన చేస్తూ, ఇకపై తమ అన్ని సేవింగ్స్ ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ఇకపై టెన్షన్ లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని చెప్పింది.
ఇండియన్ బ్యాంక్
ఈ బ్యాంక్ కూడా ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. జులై 7, 2025 నుంచి తమ అన్ని సేవింగ్ అకౌంట్ల మీద మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను తీసేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది ప్రజలకు చాలా ఉపయోగం కలుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు వంటి వాళ్ళు ఇకపై కనీస బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ సేవలను అందరికీ చేరువ చేయడానికి ఈ నిర్ణయాలు చాలా సహాయపడతాయి.