Sarpanch Navya: కేసీఆర్ కు సర్పంచ్ నవ్య అనూహ్య విన్నపం.. స్టేషన్ ఘన్ పూర్ లో ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నియోజకవర్గమైన స్టేషన్ ఘన్ పూర్ లో టికెట్ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు.

Written By: Bhaskar, Updated On : September 1, 2023 10:01 am

Sarpanch Navya

Follow us on

Sarpanch Navya: తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి తరఫునుంచి 115 అసెంబ్లీ నియోజకవర్గా లకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే వీరిలో ఏడుగురికి టికెట్ ఇవ్వలేదు. ఈక్రమంలోనే అసంతృప్తులు భారత రాష్ట్ర సమితి అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో కెసిఆర్ అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్టేషన్ ఘన్ పూర్ లో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నియోజకవర్గమైన స్టేషన్ ఘన్ పూర్ లో టికెట్ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు వైద్యారోగ్య శాఖ కేటాయించారు. అయితే కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించారు. 2018 ఎన్నికల్లో మళ్లీ ఆయనకు
స్టేషన్ ఘన్ పూర్ స్థానం కేటాయించారు. అయితే ఇటీవల ఆయన ఒక సర్పంచ్ ను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. పైగా దళిత బంధు పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి. అయితే కొంతమంది లబ్ధిదారులు నేరుగా ప్రగతి భవన్ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఎమ్మెల్యే ద్వారా వారికి ఇప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టే ఆయనకు టికెట్ ఇవ్వలేదని వాదనలు వినిపిస్తున్నాయి.

కడియం శ్రీహరికి అవకాశం

అయితే ఇటీవల కేసీఆర్ ప్రకటించిన జాబితాలో స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో రాజయ్య వర్గం ముఖ్యమంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజయ్య నేరుగా ఆరోపణలు చేయకపోయినప్పటికీ.. అంతర్గతంగా తనకు అసెంబ్లీ స్థానం కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మందకృష్ణ మాదిగ రాజయ్యను పరామర్శించారు. కడియం శ్రీహరిని గుంట నక్కతో పోల్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే బీఎస్పీ తరఫున టికెట్ ఇస్తామని రాజయ్యకు ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేసే పనిలో ఉన్నారని రాజయ్య వర్గం అంటోంది. ఇక రాజయ్య ఎపిసోడ్ ఇలా కొనసాగుతూ ఉంటే.. రాజయ్యను ఆ మధ్యన ఇబ్బంది పెట్టిన సర్పంచ్ నవ్య.. ఇప్పుడు సడన్ గా సీన్ లోకి ఎంటర్ అయింది. తాను అన్ని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని, తనకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అర్జీ పెట్టుకుంది. జానకిపురం సర్పంచ్ గా కొనసాగుతున్న ఆమె.. గతంలో రాజయ్య తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. విలేకరుల సమావేశం పెట్టి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా రాజయ్య క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు మీడియా ఇచ్చిన హైప్ తో నవ్య వార్తల్లో వ్యక్తి అయింది. దానిని ఇప్పుడు ఈ విధంగా క్యాష్ చేసుకునే పనిలో పడింది.

ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి కడియం శ్రీహరి పేరును ప్రకటించినప్పటికీ.. తాను ఇప్పటికీ టికెట్ రేస్ లో ఉన్నానని రాజయ్య అంటున్నారు. వీరిద్దరితో పాటు నవ్య కూడా పోటీ పడుతుండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. కాబట్టి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని నవ్య వేడుకుంటున్నది. శుక్రవారం హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి ప్రముఖులను నవ్య దంపతులు కలవనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నవ్య టికెట్ కోసం అర్జీ పెట్టుకోవడం వెనుక భారత రాష్ట్ర సమితి కీలక నేత ఉన్నారని తెలుస్తోంది.