Delhi Liquor Scam- Sarat Chandra: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ విషయమై కోర్టుకు అప్పీల్ చేసుకోగా, అనుమతించింది. అయితే, అసలు అప్రూవర్ అంటే ఏమిటి? అప్రూవర్ గా మారిన తరువాత ఏం చేయాలి? సంబంధిత కేసులో ఎలా నడుచుకుంటారు?.
అప్రూవర్ అంటే..
ఏదైనా కేసులో నిందితుడు సాక్షిగా మారడాన్ని అప్రూవర్ అంటారు. ఏ కేసు అయినా కోర్టు ముందుకు నిరూపణ అవ్వాలంటే అందుకు సాక్ష్యాలు అవసరం. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తగిన ఆధారాలతో చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. బహిరంగంగా జరిగిన ఘటనలపై ఆ స్థాయి విచారణ అవసరం ఉండదు. కొన్ని బడా రాజకీయ వేత్తలు, సంక్లిష్ట కేసులను మరింత లోతుగా విచారించేందుకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు కేసులను కోర్టు బదిలీ చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం, వివేకా హత్య కేసు. వీటి విచారణలో సాక్ష్యాలను ఒడిసిపట్టుకోవడం కీలకాంశం.
అప్రూవర్ గా మారతానని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీబీఐ,
ఈడీల అనుమతితో కోర్టుకు అప్పీల్ చేసుకోవాలి. ఆ అప్పీల్ పై కోర్టు సంతృప్తి చెందితే అనుమతి ఇస్తుంది. అప్పుడు నిందితుడుగా ఉన్న వ్యక్తి సాక్షిగా మారిపోతాడు. అప్పటి వరకు ఉన్న నిబంధనలు కొంత సడలింపులు లభిస్తాయి. అప్రూవర్ గా మారిన వ్యక్తి విచారణలో పూర్తి స్థాయిలో సహకరించాలి. కేసులో మిగతా నిందితులకు సంబంధించిన సమాచారాన్ని అందించాలి. తగిన సాక్ష్యాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అప్రూవర్ గా మారిన వ్యక్తి తగిన సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తుంటే, కోర్టు ఏ క్షణమైనా సాక్షిగా తొలగించే అవకాశం ఉంటుంది.
లిక్కర్ స్కాంలో..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. బడా రాజకీయ నాయకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని సీబీఐ వాదిస్తోంది. ఢిల్లీ ఆప్ మంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. ఆ తరువాత ప్రధానంగా వినిపిస్తున్న పేరు తెలంగాణ ముఖ్యమంత్రి తనయురాలు కవితదే. అందుకు అవసరమైన సాక్ష్యాలను ఈడీ సేకరిస్తోంది. అయితే, కేసులో అడుగు ముందుకు పడటం లేదు. ఇటువంటి తరుణంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలను శరత్ చంద్రారెడ్డి ఈడీకి ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగబోతున్నది ఆసక్తికరంగా మారింది.